డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీకాలం పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీకాలం పొడిగింపు

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా సహకార కేంద్రబ్యాంకు నాన్‌ ఆఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీ కాలం ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీతో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో వ్యవసాయ, సహకార శాఖల ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ ఆరు నెలలు పొడిగిస్తూ జీవో ఆర్‌టీ నంబరు 551 జారీ చేశారు. కర్నూలు డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ డి.విష్ణువర్ధన్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబరు 26 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

శాస్త్రోక్తంగా సహస్ర దీపార్చన సేవ

శ్రీశైలంటెంపుల్‌: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవ నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

తుంగభద్రలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

కర్నూలు (సెంట్రల్‌): నగర పరిధిలోని తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించినట్లు వన్‌టౌన్‌ సీఐ మారుతి శంకర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతురాలు 5.6 అడుగుల ఎత్తు ఉండి, కుడి చేతిపై కె.బాషా అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. లేత ఆకుపచ్చ పూల అంచుల నల్ల చీర, ఆకుపచ్చ గాజులు ధరించిందని, ఎవరైనా ఆమెను గుర్తు పడితే వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సమాచారమివ్వాలని సీఐ సూచించారు.

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ దాడులు

వెల్దుర్తి: మండల కేంద్రంలోని 7 విత్తనాలు, ఎరువుల దుకాణాలలో సోమవారం ఏకకాలంలో కర్నూలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ పవన్‌ కిశోర్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రిజిస్టర్లు, స్టాకు పరిశీలిస్తూ, గోడౌన్‌లలో సోదాలు చేపట్టారు. రెండు దుకాణాలలో యూరియా, ఇతరత్రా ఎరువులను ఎమ్మార్పీకి మించి అమ్మడాన్ని గుర్తించారు. ఆయా దుకాణదారులపై నిత్యావసరాల చట్టం క్రింద కేసు నమోదు చేసి, రూ.4,09,450ల విలువైన 274 బస్తాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. దాడుల్లో కర్నూలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవసాయాధికారి విశ్వనాథ్‌, స్థానిక వ్యవసాయాధికారి అక్బర్‌ బాషాపాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్యాపిలి: పట్టణ సమీపంలోని స్థానిక కలచట్ల బ్రిడ్జిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రమోహన్‌ (50) మృతి చెందాడు. తుగ్గలి మండలం లంకాయపల్లె గ్రామానికి చెందిన చంద్రమోహన్‌ సొంత పని నిమిత్తం బైక్‌పై ప్యాపిలికి చేరుకున్నాడు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా కలచట్ల బ్రిడ్జిపై లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రున్ని డోన్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు.

గర్భిణి ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఆదోని అర్బన్‌: తనతోపాటు రెండేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లి రాంజల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందు వెళ్లిన గర్భిణిని ఆదోని త్రీటౌన్‌ పోలీసులు అన్వర్‌, గురుప్రసాద్‌, పరశురామ్‌ కాపాడారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలో అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఫిఫా అలియాస్‌ ఈశ్వర్‌, సునీత భార్యభర్తలు. ప్రతిరోజూ భర్త మద్యం సేవించి వేధించేవాడు. సోమవారం మద్యం మత్తులో వచ్చి భార్య సునీతతో గొడవపడి చెప్పుతో కొట్టాడు. దీంతో సునీత అవమానంగా భావించి రెండేళ్ల కుమారుడిని ఎత్తుకుని రాంజల చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆమె ప్రవర్తన చూసిన స్థానికులు వెంటనే 100కు కాల్‌ చేయడంతో తాము స్పందించి రాంజల చెరువు వద్దకు వెళ్లి సునీతను, ఆమె రెండేళ్ల కుమారుడిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement