1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1980 అటవీ సంరక్షణ చట్టాలు కేవలం అడవుల సంరక్షణ కోసం మాత్రమే పరిమితమవుతున్నాయి. గడ్డి మైదానాల రక్షణకు స్వయం ఛాలక వ్యవస్థ ఏది లేక పోవడం సంపూర్ణ జీవావరణ వ్యవస్థకు విఘాతంగా మారుతోంది. అలాగే గ్రాస్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ మురాత్కర్ లాటి వారిచేత గడ్డి మైదానాల అభివృద్ధిపై వర్క్‌షాప్‌లు, ప్రణాళికలు ఎన్‌ఎస్‌టీఆర్‌లో చేపడుతున్నప్పటికీ అడవి వెలుపల ఉన్న రోళ్ల పాడు గడ్డి మైదానాల అభివృద్ధికి, రక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గడ్డి మైదానాలను కీలకమైన వన్యప్రాణి ఆవాస కేంద్రాలుగా గుర్తించి వాటి రక్షణకు ప్రభుత్వం పూనుకోవాలి. అప్పుడే గడ్డి మైదానాల ఆవాస వన్యప్రాణులైన కృష్ణ జింకలు, తోడేళ్లు, బట్టమేక పక్షులు, గోల్డెన్ జాకాల్ (నక్క)లు మనుగడ సాగిస్తాయి. ఇప్పటికే ఈ గడ్డి మైదానాల నుంచి అదృశ్యమైన ఏషియన్ చీతా అంశం నుంచి పాఠాలు నేర్చుకుని వాటి పునరుజ్జీవనానికి కృషి చేయాలని జీవావరణ ప్రేమికులు కోరుతున్నారు.


