● పంటలకు గిట్టుబాటు ధర లేదు
● పెట్టుబడి సాయం దూరమైంది
● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే
కంగాటి శ్రీదేవి
పత్తికొండ: దగాకోరు ప్రభుత్వంలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఆదివారం పత్తికొండ పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందేవని తెలిపారు. నేడు అన్నదాత సుఖీభవ క్రమంగా అన్నదాత దుఃఖీభవగా మారిందన్నారు. కేంద్రసాయంతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది రూ. 20 వేలు అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని విమర్శించారు. అన్నదాత సుఖీభవలో ప్రతి ఏడాది రైతులు సంఖ్య పెరగాలని కాని అందుకు భిన్నంగా తగ్గడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, సున్నావడ్డీ రుణాలు రద్దు చేశారని, రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. పత్తికొండ నియోజకవర్గంలో రైతులు పండించిన టమాట, ఉల్లి పంటను గత ఏడాది రోడ్లపై, పొలాల్లో పారబోస్తుంటే కనీసం దయ కూడా చూపలేదన్నారు.
‘కూటమి’ నిర్లక్ష్యం
కూరగాయలు పండించడంలో పత్తికొండ ప్రాంత రైతు లు భారీ స్థాయిలో ఉండటం గర్వంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టమాట సాగులో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి తరువాత పత్తికొండ రెండో స్థానంలో ఉందన్నారు. ఇంతటి స్థాయిలో కూరగాయులు పండించే పత్తికొండ రైతులపై అన్ని విధాలా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సోమశేఖర్, మేధావుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరంగడు, సీనియర్ నాయకులు అటికెలగుండు బాబుల్‌రెడ్డి, ఎంపీపీ నారాయణ్‌దాస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌నాయక్, బనగాని శ్రీనువాసులు, మండల కన్వీనర్ కారం నాగరాజుయాదవ్, నాయకులు కేశవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సాబ్డిన్ నూర్‌భాషా, జాకీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.


