● జిల్లాలో 16 కేంద్రాల్లో నిర్వహణ ● 92.29 శాతం హాజరు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నీట్ రీఎగ్జామ్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6.15 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,995 మందికి గాను 4,610మంది విద్యార్థులు హాజరు 385 మంది గైర్హాజరయ్యారు. గత నెలలో నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో రీ–ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించారు.
భారీ బందోబస్తు
ప్రతి కేంద్రానికి ఒక తహసీల్దార్, ప్రతి నాలుగు కేంద్రాలకు ఓ జిల్లా అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అదే విధంగా కేంద్రాల దగ్గర భారీగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్ష విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్‌టీఏ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. కర్నూలు బీక్యాంపులోని ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి డోన్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయారని సమాచారం. కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కనుక్కునేందుకు కొంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక హైస్కూల్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, 92.29 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.


