గతంలో రైతుల నుంచి పాసుపుస్తకం జిరాక్స్ ప్రతిని తీసుకుని వివరాలు రాసుకుని టోకన్ ఇచ్చేవారు. రైతులకు సమయం ఎంతో ఆదా అయ్యేది. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలకు వచ్చి పాసుపుస్తకం, ఆధార్‌కార్డు సమర్పించి వివరాలను నమోదు చేయించుకుని, మూడు సార్లు వచ్చిన ఓటీపీలను చెప్పాల్సి వస్తుంది. దీంతో రైతులు ఉదయం నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
– మహానంది, రైతు
నేను 50 ఎకరాల్లో సోయాబీన్, ఆరు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు డీఏపీ ఒక బస్తా ఇస్తే ఏరకంగా పంట సాగు చేయాలి? నాకున్న సొంత భూమికి ఇచ్చారు. కౌలుకు వేసుకున్న 20 ఎకరాల పొలానికి ఎరువులు ఎట్లా? పొలం కౌలుకు ఇచ్చిన వారు ఇక్కడ లేరు. వారు ఇక్కడకు వచ్చి యాప్‌తో వేలిముద్ర వేసి ఎరువులు ఇప్పించడం కుదురుతుందా? ఇప్పుడు నాకు సోయాబీన్‌కు డీఏపీ, యూరియా కావాలి. పంటను పండించాలా, నాశనం చేసుకోవాలా? ఇలాగైతే వ్యవసాయం చేయలేం!
– శ్రీనివాసులు, రైతు పాములపాడు
నేను నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. కొన్ని రోజులుగా డీలర్లు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు. వరి మడులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంటే బాగుంటుంది. యూరియా అత్యవసరమవుతుంది. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. కానీ మాకు యాప్ తెలియదు. ప్రభుత్వమే అర్హులైన రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలి.
– కురవ భీరప్ప, రైతు, జొహరాపురం


