● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి
కర్నూలు (టౌన్): అనునిత్యం ఎదురయ్యే అటుపోట్లను అధిగమించేందుకు నిజ జీవితంలో యోగా అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశమన్నారు. న్యాయ శాఖ ఉద్యోగి, యోగా మాస్టర్ ముంతాజ్ యోగాసనాలు చేయించారు. జిల్లా జడ్జీలు రామచంద్రుడు, శోభారాణి, లక్ష్మీరాజ్యం, వెంకట హరినాథ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, సీనియర్ సివిల్ జడ్జీలు సంధ్యారాణి, అపర్ణ, సరోజమ్మ, అనూష, స్రవంతి, అనిల్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.


