ఎమ్మిగనూరురూరల్/గోనెగండ్ల: పొలంలో పనిచేస్తూ గుండెపోటు రావటంతో వీఆర్వో తలారి మునెప్ప(53) మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన మునెప్ప గతంలో కౌతాళం మండలం ఎరిగేరిలో వీఆర్వోగా పనిచేశారు. సంవత్సరం క్రితం గోనెగండ్ల మండలానికి బదిలీపై వచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తన స్వగ్రామం అయిన పార్లపల్లి గ్రామానికి వెళ్లారు. భార్య భాగ్యమ్మతో కలసి పొలం పనులకు వెళ్లి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వస్తుందని భార్యకు చెప్పి పక్కకు ఒరిగిపోయారు. వెంటనే భార్య భాగ్యమ్మ కుమారుడు నరసింహులుకు ఫోన్ చేసి చెప్పారు. పొలం దగ్గరకు వెళ్లి ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధం చేయటంతో అప్పటికే ప్రాణాలు వదిలినట్లు గుర్తించారు. దీంతో మునెప్ప మృతదేహంపై పడి భార్య, కుమారుడు రోదించటం అక్కడి వారి కంట కన్నీరు తెప్పించింది. వీఆర్వో మునెప్పకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీఆర్వో మృతిపై గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి, సిబ్బంది సంతాపం తెలిపారు.


