ఓటరూ.. ఆందోళన వద్దు! | - | Sakshi
Sakshi News home page

ఓటరూ.. ఆందోళన వద్దు!

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

ఎవరి ఓట్లను తొలగించం

అన్‌ మ్యాప్‌డు కాకపోయినా..

కర్నూలు(సెంట్రల్‌): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)పై ఎన్నికల కమిషన్‌ ఓటర్లకు శుభవార్త చెప్పింది. అన్‌మ్యాప్‌డు ఓటర్లను భయపెడుతున్న అంశంపై తాజాగా వివరణ ఇచ్చింది. 2025, 2002 ఓటరు జాబితాలు మ్యాప్‌ కాకపోయినా ఎన్యుమరేషన్‌ ఫామ్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. అంతేకాక ఎన్నికల కమిషన్‌ గుర్తించిన ఆధార్‌తోపాటు 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఒక్కదాన్ని సమర్పించాలని షరతు పెట్టింది. కర్నూలు జిల్లాలో 2025 ఓటరు జాబితా ప్రకారం 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల వివరాలన్నీ 2002 జాబితాతో సరి పోల్చడమే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ముఖ్య ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్న ఓటర్లలో చాలా మంది 2002 జాబితా తో పోల్చితే మ్యాప్‌ కావడం లేదు. దీంతో చాలా మంది అన్‌మ్యాప్‌డ్‌గా మిగిలిపోతున్నారు. దీంతో వారంతా తమను ఓటర్లుగా తొలగిస్తారనే భయంతో ఉన్న నేపథ్యంలో అన్‌ మ్యాప్‌డ్‌ ఓటర్లకు ఎన్నికల కమిషన్‌ వివరణతో కొంత ఆందోళన తగ్గింది.

రెండు జాబితాల్లో పేరు లేకపోతే...

ప్రస్తుతం జరుగుతున్న సర్‌ ప్రక్రియలో 2002, 2025 ఓటరు జాబితాలు అత్యంత కీలకం. రెండు జాబితాల్లో ఓటరుగా ఉండటం లేదా తల్లిదండ్రులు వివరాలు కలిగి ఉండాలి. అప్పుడు ఓటరుగా కొనసాగిస్తారు. అయితే రెండు జాబితాల్లో పేర్లు లేనివారు ఏమి చేయాలంటే... కొత్తగా ఓటు నమోదుకు ఫామ్‌–6ను నింపి ఇస్తే సరిపోతుంది. వారి పేరు కూడా కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో వచ్చేస్తుంది.

డబుల్‌ ఓటర్లకు.. ట్రబులే!

ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో చాలా మందికి రెండు చోట్లా ఓటు హక్కు ఉంది. అయితే గతంలో ఎన్నికల కమిషన్‌ చేపట్టే స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)లో దానిని గుర్తించేందుకు డమోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ పద్ధతిని వాడిన సరైన ఫలితం లభించేది కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం చేపట్టే సర్‌లో మాత్రం డబుల్‌ ఓటర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెండు చోట్లా ఓటు ఉన్నా ఒక్క చోటే ఎన్యుమరేషన్‌ ఫామ్‌ ఇవ్వాలి. కాదని రెండు చోట్లా ఇచ్చినా వారు సమర్పించి గుర్తింపు కార్డులతో పట్టుబడే అవకాశం ఉంది. దీంతో డబుల్‌ ఓటర్లకు ట్రబుల్‌ మొదలైందనే చెప్పవచ్చు.

ప్రస్తుతం ఉన్న ఓటర్లలో ఎవరినీ తొలగించం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అయితే సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దు. ఓటర్లు సరైన డాక్యుమెంట్లను సమర్పిస్తే ఎవరి ఓటును తొలగించడం, చేర్చడంకానీ చేయడానికి వీలు ఉండదు. అన్‌మ్యాప్‌డు ఓటర్లు అయితే ఎన్యుమరేషన్‌ ఫామ్‌ను ఇస్తే సరిపోతుంది. దానికి 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఒక దానిని సమర్పించాల్సి ఉంటుంది.

– డాక్టర్‌ ఎ.సిరి, జిల్లా ఎన్నికల అధికారిణి, కర్నూలు

ఎన్యుమరేషన్‌ ఫామ్‌ నింపితే చాలు

ఓటు పదిలమే

2002 జాబితాలో తల్లిదండ్రుల పేర్లు

లేకపోయినా భయం అవసరం లేదు

ఎన్యుమరేషన్‌ ఫామ్‌తోపాటు

13 రకాల గుర్తింపు కార్డుల్లో

దేనినైనా సమర్పిస్తే సరి

2002, 2025 జాబితాల్లో

అసలు పేరే లేకపోతే

ఫామ్‌–6 ఇస్తే ఓటుగా నమోదు

2002 జాబితాలో ప్రస్తుత ఓటరు వివరాలు లేకపోయినా, వారి తల్లిదండ్రుల వివరాలు లేక పోయినా.. మ్యాపింగ్‌ అయి ఉంటే చాలు ఎన్యుమరేషన్‌ ఫామ్‌ ఇస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే అన్‌మ్యాప్‌డ్‌ ఓటర్లకు నోటీసు ఇస్తామని, తాము గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల కమిషన్‌ వివరణ ఇచ్చింది.

1987 జూలై ఒకటో తేదీ నాటికీ ఓటరు జన్మించి ఉంటే తనకు సంబంధించిన గుర్తింపు కార్డుల్లో ఒక్కదాన్ని ఇస్తే సరిపోతుంది.

1987 జూలై 01 నుంచి 2004 డిసెంబర్‌ 02వ తేదీ మధ్య జన్మించి ఓటరైతే తన ఒక్క గుర్తింపు కార్డుతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

2004 డిసెంబర్‌ 02 తరువాత జన్మించిన ఓటరైతే తన గుర్తింపు కార్డుతోపాటు తల్లిదండ్రుల ఇద్దరి గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుంది. 2004 తరువాత విదేశాల నుంచి వచ్చి ఇండియాలో ఉంటే అతని పాస్‌పోర్టు, వీసాలను సమర్పించి ఓటు హక్కును పొందవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement