శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా శోభన్‌బాబు
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు గంగుమాల శోభన్‌బాబు పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటనను జారీ చేసింది. శోభన్‌బాబు కరాటే రంగంపై మక్కువతో తైక్వాండో రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు. వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తుండడంతో పార్టీలో పదవి లభించింది.
యువకుడిపై పోక్సో కేసు
బొమ్మలసత్రం: పట్టణంలోని టూటౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అస్రార్‌బాషా తెలిపారు. మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక ఇంటి ముందు ఒంటరిగా నిద్రిస్తుండగా ఇంటి పక్కన నివాసముంటున్న 18 ఏళ్ల జ్ఞానమూర్తి బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన బాలిక కుటుంబ సభ్యులు యువకుడినిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేశారు.
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
కొలిమిగుండ్ల(అవుకు): మండల పరిధిలోని గుండ్లశింగవరం సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నుంచి నంద్యాల వైపు వెళుతున్న కారు గుండ్లశింగవరం సమీపానికి చేరుకోగానే మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాల్వలోకి పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు క్షేమంగా బయట పడ్డారు. స్థానికులు, వాహనదారుల సాయంతో ఇరువురిని బయటకు తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పంట కాల్వలో పడిన కారును క్రేన్ సాయంతో బయటకు తీయించారు.
అనధికార మద్యంవిక్రయదారుల అరెస్ట్
కర్నూలు: బెల్ట్ దుకాణాల ద్వారా (అనధికార) మద్యం విక్రయాలు జరుపుతున్న 45 మందిని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టాస్క్‌ఫోర్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి 67 లీటర్ల అనధికార మద్యం సీజ్‌చేసి విక్రయదారులపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 14 ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి, ఆయా స్టేషన్ల అధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనధికార మద్యం దుకాణాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్య పానంపై కూడా తనిఖీలు నిర్వహించారు. 32 మందిపై బహిరంగ సేవనం కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
బనగానపల్లె: మండలంలోని రాళ్లకొత్తూరు గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. రాళ్లకొత్తూరుతండా గ్రామానికి చెందిన కిశోర్‌నాయక్ (23) రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. శనివారం డ్యూటీ ముగిశాక మోటర్ సైకిల్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రాళ్లకొత్తూరు సమీపంలో రహదారిపై లారీ ఆగి ఉంది. చీకటిలో కనిపించకపోవడంతో దానిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బనగానపల్లె సీఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి సోదరుడు రవితేజానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


