● టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు
చిప్పగిరి: చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. హొళగుంద మండలంలోని సులువాయి గ్రామం నుంచి 30 కుంటుంబాల సభ్యులు టీడీపీని వీడి ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో వారికి వైఎస్సార్‌సీపీ కండువా వేసి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రజలకు నచ్చడం లేదన్నారు. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ పేరుతో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి గొప్పలు చెబుతున్నారని, అధికారం చేపట్టి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదన్నారు. అభివృద్ధి పేరిట చేసస్తున్న రూ. లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోతున్నాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీని భూస్థాపితం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో శేఖప్ప, ఖాశీం, నాగరాజు, ఉప్పర రామంజిని, బోయ గోవిందు, మహబూబ్ సాబ్, చాకలి హనుమంతు, శంకరప్ప, బోయ తిమ్మప్ప, దాసరి బీమయ్య, చంద్రశేఖర్, తిక్కప్ప, హుసేని, మల్లికార్జున, సుభాన్ సాబ్, గిరప్ప తదితరులు ఉన్నారు.


