● టీబీ డ్యాం ఎగువన కురవని వర్షాలు
● పూర్తిగా నిలిచిన ఇన్‌ఫ్లో
● డ్యాంలో 9.748 టీఎంసీలు నీరు నిల్వ
హొళగుంద: ఈ ఏడాది ప్రారంభంలో తుంగభద్ర డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్ నెలలో వేగంగా నిండిన డ్యాం ప్రస్తుతం వెలవెలబోతోంది. నైరుతి రుతుపవనాల ఆగమనం జరిగినా జలాశయం ఎగువ భాగంలోని శివమొగ్గ, చిక్‌మంగళూరు, శృంగేరి, వరనాడు తదితర ప్రాంతాల్లో వర్షాలు కురువకపోవడంతో డ్యాంకు వరద రావడం లేదు. రెండు వారాల క్రితం అడపాదడపా వర్షాల కారణంగా వరద వచ్చినా అది కూడా 500 క్యూసెక్కులు దాట లేదు. దీంతో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనబడుతుండడంతో జలాశయం మీద ఆధార పడిన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం డ్యాంకు ఇన్‌ఫ్లో 78 క్యూసెక్కులుండగా సాయంత్రానికి దాదాపు 30 క్యూసెక్కులకు పడి పోగా.. ఆదివారం ఉదయానికి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఈ సమయానికి ఇన్‌ఫ్లో 38 వేల క్యూసెక్కులు ఉండేది. జలాశయం పూర్తి సామర్థ్యం 1,633 అడుగుల వద్ద 105.788 టీఎంసీలు కాగా గతేడాది ఇదే సమయానికి 1612.09 అడుగుల వద్ద 41.856 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది ఆదివారం నాటికి 1588.40 అడుగుల వద్ద కేవలం 9.748 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. వరుణుడు కరుణిస్తాడా.. రిజర్వాయర్ నిండుతుందా అని మూడు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.


