జవాబు లేని ప్రశ్నలు | - | Sakshi
Sakshi News home page

జవాబు లేని ప్రశ్నలు

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

ప్రాణాలు తీస్తున్న పోలీసులు

ఆదోని: పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు కౌతాళం ఘటన తాజా ఉదాహరణ. 21 రోజుల క్రితం సిట్‌ విచారణలో ఓ మహిళ చనిపోగా.. ఇప్పటి వరకు ఆ వివరాలు బయటకు పొక్కలేదు. కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్లు పత్రికలు కోడై కూస్తున్నా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే కేసులోని మరో వ్యక్తిని సైతం పోలీసులు విచారణ పేరిట చావబాదినట్లు తెలుస్తోంది. ఈయన కూడా ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇతని విషయంలోనూ పోలీసులు గోప్యత పాటిస్తుండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌతాళం మండలం బదినేహాళ్‌ గ్రామానికి చెందిన గంగమ్మ తన కుమారుడు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన పోలీసు అధికారులతో ఒక సిట్‌ ఏర్పాటుకు కోర్టు ఆదేశించింది. అయితే సిట్‌ అధికారులకు ఈ కేసు అంతుచిక్కలేదు. చివరకు తమదైన శైలిలో గంగమ్మను విచారణ చేశారు. నిజాలు బయటకు వచ్చాయి. విధవరాలైన తను బ్యాగారి దర్గప్ప అనే వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన కుమారుడిని తామే చంపి రహస్య స్థలంలో పూడ్చి పెట్టామని తెలిపింది.

ఆ రూ.2లక్షలు ఎవరి చేతి నుంచి!

ఖాకీ దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లిన దర్గప్పను పోలీసులు మొదట అత్యంత గోప్యంగా కర్నూలులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం. ఒక పోలీసు అధికారి తన సొంత ఖర్చుతో రూ.2లక్షలు ఖర్చు చేసినా కోలుకోకపోవడంతో సదరు పోలీసు అధికారి కూడా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. చివరకు దర్గప్పను కర్నూలు పెద్దాసుపత్రిలోని పోలీసు సదన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

కర్నూలు టు విజయవాడ

కౌతాళం ఘటన పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. సిట్‌ అధికారుల దర్యాప్తు తమ మెడకు ఎక్కడ బిగుసుకుంటుందోనని జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి పోలీసుల వరకు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కేసును ఎలాగైనా మసిపూసి మారేడుకాయ చేసేందుకు పోలీసులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కర్నూలు, విజయవాడ ప్రాంతాలకు న్యాయ సలహాల కోసం తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఒక సీఐపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కౌతాళం పోలీసుస్టేషన్‌ పోలీసులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని, ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం చేర్చినప్పుడు సాధరణ రోగిలా కాకుండా మెడికో లీగల్‌ కేసుగా నమోదు చేశారా?

రోగిని పోలీసులు రెఫర్‌ చేస్తే ఆసుపత్రి వర్గాలు మెడికో లీగల్‌ కేసు కింద నమోదు చేశారా?

గాయాల స్వభావం, పరిస్థితి, చేర్పించిన సమయం, పోలీసు అధికారుల వివరాలు మొదలైనవి రిజిస్టర్‌లో పొందుపరిచారా?

వైద్యులు గాయాలపై నివేదిక తయారు చేసి, అవసరమైతే మేజిస్ట్రేట్‌ లేదా దర్యాప్తు సంస్థలకు అందజేస్తారు? ఇలాంటి ప్రక్రియ చేపట్టారా?

చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు నోరు మెదపడం లేదు.

అసలు దర్గప్పను బయటి ప్రపంచానికి ఎందుకు చూపడం లేదు. స్పృహలోనే ఉన్నాడా? లేక కోమాలోకి వెళ్లిపోయాడా?

రెండు రోజుల క్రితం పోలీసు సదన్‌లో దర్గప్ప స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఆ వివరాలను బయటపెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో పోలీసులకే తెలియాలి.

సిట్‌ విచారణ పేరిట

ఓ మహిళ మృతిపై అనుమానాలు

అదే కేసులోని మరో వ్యక్తి

మృత్యువుతో పోరాటం

21 రోజులుగా కర్నూలు

ప్రభుత్వాసుపత్రిలో గోప్యంగా చికిత్స

కలకలం రేపుతున్న పోలీసుల తీరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement