పదిలో 99.24 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

పదిలో 99.24 శాతం ఉత్తీర్ణత

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

నీట్‌ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

కర్నూలు(అర్బన్‌): జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు 99.24 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి బి.సురేష్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి ఆదేశాల మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా మొత్తం 132 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా, మొదటి విడతగా మార్చిలో 108 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మే నెలలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో 24 మంది పరీక్షలు రాయగా, 23 మంది ఉత్తీర్ణత సాధించగా.. ఒకరు మాత్రమే ఫెయిల్‌ అయ్యారన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.

రేపటి నుంచి రైతన్నా..

మీ కోసం వారోత్సవాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): వ్యవసాయ శాఖ మరోసారి రైతన్నా.. మీ కోసం వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ ఏడాది మార్చిలో ఇదే కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు వారోత్సవాల నిర్వహణకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రైతుభరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ శాఖ ఫీల్డ్‌ బృందాలు రైతుల ఇంటింటికి వెళ్లి ప్రధానంగా ఐదు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటల సాగు, వ్యవసాయ సాంకేతికత వినియోగం, ఆహార ప్రాసెసింగ్‌ విస్తరణ, రైతులకు ఆర్థిక సహాయం తదితరాలపై ఫీల్డ్‌ బృందాలు రైతులతో చర్చిస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు 90 కుటుంబాల ప్రకారం ఆరు రోజుల్లో 540 కుటుంబాలను రైతన్నా.. మీ కోసం కింద కవర్‌ చేస్తామన్నారు.

కేజీబీవీల్లో సీసీ కెమెరాలు

కర్నూలు సిటీ: కసూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో భద్రతను మరింత పెంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూళ్లతో పాటు, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, పీఎంశ్రీ స్కూళ్లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉండగా, దాదాపు అన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు పూర్తయింది. అయితే ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు కేజీబీవీల్లో మాత్రమే సీసీ కెమెరాల ఆపరేంటింగ్‌కు అవసరమైన ఇంటర్‌నెంట్‌ను అమర్చారు. వీటి పనితీరును సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.బి లోకరాజు పరిశీలించారు. వచ్చే వారంలోపు అన్ని కేజీబీవీల్లో ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

కర్నూలు సిటీ: నీట్‌ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో నీట్‌ పరీక్ష హాల్‌ టికెట్‌ చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యూనిఫైడ్‌ సర్వేపై

అభ్యంతరాలను తెలపండి

కర్నూలు(అర్బన్‌): యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే డేటాలో కుటుంబ వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు, పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా ఫిర్యాదు చేసుకోవచ్చని జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల అధికారి టీవీ భాస్కర్‌నాయుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యంతరాలను ఆయా సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్‌ సెక్రెటరీల ద్వారా పోర్టల్‌లో నమోదు చేయవచ్చన్నారు. కులంతో సంబంధం లేని ఫిర్యాదులను ఈ నెల 26వ తేది నాటికి, కులంతో సంబంధం ఉన్న ఫిర్యాదులను ఈ నెల 27వ తేది నాటికి సరిచేసి యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే డేటాను వ్యాలిడేషన్‌ చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement