కర్నూలు (టౌన్): పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీకి తొత్తులుగా మారవద్దని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. బాధితులు పోలీసుస్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నా స్పందించకోపోవడం దారుణమన్నారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ వార్డులో పనులు చేస్తున్నారని, తనకు రూ.5 లక్షలు కమీషన్ ఇవ్వాలంటూ మున్సిపల్ కాంట్రాక్టర్‌తో శ్రీరామనగర్‌కు చెందిన టీడీపీ నాయకుడు సునీల్ కుమార్ గొడవపడారన్నారు. అంతటితో ఆడగకుండా రెండు రోజుల క్రితం దాడి కూడా చేశారన్నారు. బాధితుడు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, కురవ సంఘం నాయకులతో కలిసి మూడో పట్టణ పోలీసు స్టేషన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కలిసి ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విన్నవించినా ఎవరి ఒత్తిళ్లతో కేసును నీరు గారుస్తున్నారని ప్రశ్నించారు.
బాధితుడిపైనే కేసు దుర్మార్గం కాదా?
కర్నూలు పదో వార్డు మాజీ కార్పొరేటర్ షేక్ యూనుస్ బాషా పార్టీ కార్యాలయంపై దాడి చేసి, సామగ్రి ధ్వంసం చేశారని ఎస్వీ మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేశారని, దీనిపై పోలీసుస్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. అయితే దాడి చేసిన మహబూబ్ ఖాన్, అనుచరులపై కేసు నమోదు చేయకుండా బాధితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడంలో పోలీసు శాఖ ఎంతగా ఒత్తిడికి గురవుతుందో తెలుస్తోందన్నారు.
బాధితులకు న్యాయం చేయండి..
సెల్యూట్ కొడతాం
తండ్రిపై దాడి చేసిన కోపంతో ప్రత్యర్థి వ్యక్తిపై పాతబస్తీకి చెందిన నలుగురు యువకులు దాడి చేశారని ఎస్వీ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరని తెలిసే దాడి చేశారని, వీరిని వెంటనే అరెస్టు చేసి రోడ్లపై నడిపించుకుంటూ వెళ్లారన్నారు. అలాకాకుండా బాధితుల వైపు పోలీసులు ఉంటే సెల్యూట్ చేస్తామన్నారు. శాంతిభద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు.
పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయింది!
టీడీపీ ఐటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న గట్టు తిలక్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరామనగర్‌కు చెందిన సతీష్ అనే యువకుడు మరణ వాంగ్మూలంలో రాశారని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఎస్వీ అన్నారు. దీంతో పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడని, అయితే అతని కారులో సారాయి ఉందని కేసులు నమోదు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. వేధింపులు భరించలేక చనిపోదామని బాలు కత్తితో చేతులు కోసుకున్నాడని, అతనికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కర్నూలులో ధర్నా చేశారన్నారు. అయితే జక్కంపూడి రాజాపై కేసులు నమోదు చేయడం దుర్మర్గం కాదా.. టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం లేదా.. అని ప్రశ్నించారు. బాధితులను వదిలి అధికార పార్టీకి పోలీస్ యంత్రాంగం కొమ్ము కాస్తోందని విమర్శించారు.
ఫిర్యాదులు చేస్తున్నా.. ఎఫ్‌ఐఆర్‌లు
ఎందుకు నమోదు చేయడం లేదు
కాంట్రాక్టర్‌పై దాడి చేసినా,
సతీష్ చనిపోయినా చర్యలేవీ?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి


