ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

సాయి లాకప్‌ డెత్‌ దృష్టి మళ్లించేందుకే కారుమూరి సునీల్‌ అరెస్టు

కర్నూలు(టౌన్‌): ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో గాదె సాయిక్రిష్ణ లాకప్‌ డెత్‌ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వెంటనే విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిందని, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అరకొర నిధులతో గత ఏడాది 20 లక్షల మందికి తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టారని, వారికి ఈ ఏడాదైనా ఇస్తారా అని ప్రశ్నించారు. ఏడాదికి 3 సిలిండర్ల హామీ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు సైతం యూరియా కోసం ఇబ్బందులు పడే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

● యువజన విభాగం ఉపాధ్యక్షులు నవీన్‌, పాణ్యం పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు సాయి, దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం బీసీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కారుమూరి సునీల్‌ను సంబంధం లేని లిక్కర్‌ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. వాస్తవానికి లిక్కర్‌ విక్రయాలను నియంత్రించడం, వైన్‌ షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. యువత, విద్యార్థులకు, మహిళలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో కోడుమూరు యువజన విభాగం అధ్యక్షులు వెంకటేష్‌, జిల్లా కార్యదర్శి మధుమోహన్‌ రెడ్డి, కల్లూరు మండల యువజన విభాగం అధ్యక్షులు మధు పాల్గొన్నారు.

తక్షణం విడుదల చేయకపోతే

రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement