కర్నూలు: కర్నూలులోని బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐచర్ వాహనం డ్రైవర్ విజయవాడకు చెందిన సత్యనారాయణ (62) మృతిచెందాడు. ఈయన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లోని ఆంజనేయ నగర్‌లో నివాసముంటూ డ్రైవర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. ఐచర్ కంటైనర్ వాహనంలో తెలంగాణలోని సూర్యపేటకు ఫుడ్ ప్రాడక్ట్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తూ కర్నూలులోని ఎన్‌హెచ్44 రోడ్డుపై బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వెళ్తూ ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఐచర్ కంటైనర్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయి డ్రైవర్ సత్యనారాయణ తీవ్ర గాయాలతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు, తల, నుదుటి భాగాలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సత్యనారాయణను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సేవలందించిన ఏపీఎస్పీ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది...
ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ దీపిక పాటిల్ ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సత్యనారాయణను ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయంతో బయటకు తీసి అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి మృతదేహాన్ని తరలించి భద్రపరిచారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


