అడవిలో అర్ధరాత్రి ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

అడవిలో అర్ధరాత్రి ఆక్రమణలు

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

ఆలూరు/హాలహర్వి: అక్రమ సంపాదన కోసం పచ్చ నేతలు ప్రకృతిని కొల్లగొడుతున్నారు. ఓ వైపు గ్రావెల్‌ కోసం కొండలను కరిగిస్తూ.. మరో వైపు ఇసుక కోసం నదులు, వాగులను గుళ్ల చేస్తున్న టీడీపీ నేతలు తాజాగా అడవిపై కన్నేశారు. అర్ధరాత్రి వేళ గుట్టుగా అడవిలో చెట్లను నరికేసి, భూములను చదును చేసి దర్జాగా ఆక్రమించుకోవాలనుకున్నారు. అయితే అటవీశాఖ అధికారుల దాడితో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన హాలహర్వి మండలం గూళ్యం గ్రామ రిజర్వు ఫారెస్టు కంపార్ట్‌మెంట్‌–2లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గూళ్యం అటవీ ప్రాంతంలో ప్రసిద్ధ దిబ్బల సోమప్ప దేవాలయం వెనుక భాగంలో ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత అనుచరులు కుట్ర పన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి జేసీబీలతో అక్కడికి చేరుకుని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వందలాది ఈత చెట్లను కూకటి వేర్లతో సహా తొలగించేశారు. అడవిలో అర్ధరాత్రి ఆక్రమణల విషయం తెలుసుకున్న ఆలూరు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, బీఎఫ్‌ఓలు విమల్‌, బాలు, తదితరులు అర్ధరాత్రి అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అయితే జేసీబీ డ్రైవర్లు వారిపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అక్రమణల సమాచారాన్ని హాలహర్వి పోలీసులకు చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను గమనించిన జేసీబీ డ్రైవర్లు వాహనాలను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆరు జేసీబీలను వెంటనే సీజ్‌ చేసి హాలహర్వి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జేసీబీ డ్రైవర్లు దాసరి తిమ్మరాజు, పి.అశోక్‌, వై.ఆనంద్‌, దాసరి హనుమేశ్‌, సందీప్‌ కుమార్‌, నవీన్‌పై, వారిని ప్రోత్సహించిన దొడ్డ గాదిలింగప్ప, పాండురంగపై కేసులు నమోదు చేసినట్లు ఆలూరు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు గురువారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. అయితే అటవీ అధికారులపై దాడి విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా అదేమీ లేదని సమాధానం ఇచ్చారు. అటవీ సంరక్షణకు విఘాతం కలిగించినా, అటవీ సంపదను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆక్రమణల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు.

అటవీ భూమిలో చెట్లను తొలగించిన దృశ్యం

పట్టుబడిన జేసీబీలను చూపుతున్న ఫారెస్ట్‌ అధికారులు

అటవీ భూముల కబ్జాకు

యత్నించిన టీడీపీ నేతల

అనుచరులు

చెట్లు నరికి, భూమిని

చదును చేసిన వైనం

అడ్డుకునేందుకు వెళ్లిన

అధికారులపై దాడి ?

ఆరు జేసీబీలు స్వాధీనం,

8 మందిపై కేసు నమోదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement