కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో సీనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు పరిపాలనాధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్‌ను అందించారు. వీరిలో ఎం.వీరభద్రయ్యను కౌతాళం ఎంపీడీఓ, బి.గిడ్డమూర్తిని జెడ్పీ, ఏవీ రమణయ్యను ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయానికి ఏఓలుగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ఏఓలుగా పదోన్నతి పొందిన వారు పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి
కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే పలువురు సీనియర్ అసిస్టెంట్లకు ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పి స్తూ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రామగిడ్డయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కడపలోని ప్రాంతీయ కార్యాలయంలో ఆయన సీనియర్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. రాయలసీమ జోన్‌లో పది మంది పదోన్నతి పొందగా అందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నారు. వీరిలో కర్నూలులోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పనిచేసే విశ్వనాథ్ కడపలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే అంబ ప్రసాద్ సింగ్ కర్నూలు మెడికల్ కాలేజీకి, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేసే శివనాగిరెడ్డి కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు, చంద్రహాసుడు కడప డీఎంహెచ్‌ఓ కార్యాలయం, బ్రాహ్మణకొట్కూరులో పనిచేసే కేవీఎన్ రాజశేఖర్ కడప డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ అయ్యారు.
నత్తనడకన వేరుశనగ పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ పంపిణీ నత్తనడకన సాగుతోంది. విత్తన పంపిణీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా జాప్యం చోటు చేసుకుంటోంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వివిధ మండలాల్లోని రైతుసేవా కేంద్రాల్లో దాదాపు 2,500 క్వింటాళ్ల వేరుశనగ రైతులకు అందుబాటులో ఉంచింది. ఆదోని, తుగ్గలి, పత్తికొండ, వెల్దుర్తి, కోడుమూరు, హాలహర్వి, ఆలూరు మండలాల్లో వేరుశనగ పంపిణీ మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వర్షాలు కురుస్తాయో లేదోననే భయం రైతులను వెంటాడుతోంది.
వైద్య ఆరోగ్యశాఖలో పీఓలకు స్థానచలనం
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్లకు స్థాన చలనం కలగనుంది. ఈ శాఖలోని పలువురు ప్రోగ్రామ్ ఆఫీసర్లు వివిధ పీహెచ్‌సీల్లో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని తప్పించి, వీరి స్థానంలో సివిల్ సర్జన్లు లేదా డిప్యూటీ సివిల్ సర్జన్లను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అర్హులైన వారి వివరాలు సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. త్వరలో ప్రస్తుతం పనిచేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారనే ప్రచారం వైద్యారోగ్యశాఖలో జోరుగా సాగుతోంది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గతేడాది సప్లిమెంటరీ పరీక్షల కంటే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది తగ్గిపోయింది. గత నెల 21 నుంచి ఈ నెల 5వ తేది వరకు నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చేపట్టారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు జనరల్ విభాగంలో 5215 మంది హాజరు కాగా 2045 మంది, వొకేషనల్ విభాగంలో 964 మంది పరీక్షలు రాస్తే 436 మంది పాసయ్యారు. సెకండియర్ జనరల్ విభాగంలో 3,388 మంది హాజరు కాగా 1927 మంది, వొకేషనల్ విభాగంలో 472 మంది హాజరు కాగా 296 మంది ఉత్తీర్ణులయ్యా రు. ఫస్టియర్‌లో జిల్లా రాష్ట్రంలో 10వ, సెకండియర్‌లో 8వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 19 నుంచి 26వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,300, రీకౌంటింగ్‌కు రూ.260 ఆన్‌లైన్‌లో చెల్లించాలని అధికారులు తెలిపారు.


