సాక్షి టాస్క్‌ఫోర్స్, కర్నూలు: ఏయ్.. మేము ప్రజాప్రతినిధి అనుచరులం. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ మున్సిపల్ కాంట్రాక్టర్‌పై దాడికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. అడ్డొచ్చిన ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌పై దౌర్జన్యం చేశారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో మున్సిపల్ కాంట్రాక్టర్‌గా, అసోసియేషన్ నాయకులుగా ఉన్న రంగయ్యకు స్థానికంగా శ్రీరామ నగర్‌కు చెందిన సునీల్ కుమార్ పని విషయం మాట్లాడాలి రమ్మని ఫోన్ చేశాడు. దీంతో ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత మా ఏరియాలో పనులు చేస్తున్నావు కదా.. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. గొడవకు దిగారు. అంత ఇచ్చుకోలేనని, తన వద్ద లేవంటూ సమాధానమిచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ప్రజా ప్రతినిధి అనుచరులు కాంట్రాక్టను తీవ్రంగా కొట్టారు. తలపై, చెవిపై దాడి చేశారు. అక్కడి నుంచి బాదితుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని వైద్యం చేయించుకున్నాడు. కర్ణబేరి దెబ్బతినిందని చెప్పడంతో మరో ప్రెవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ విషయమై ‘సాక్షి’ బాధితుడితో మాట్లాడగా.. ‘‘నగరంలోని శ్రీరామనగర్‌కు చెందిన టీడీపీ ముఖ్యనేత అనుచరులు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. ఇవ్వకుంటే ఎలా పనులు చేస్తావో చూస్తామని బెదిరించారు. ఇలాగైతే కర్నూలులో ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని వాపోయినా వినిపించుకోలేదు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరుగలేదు. 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కాంట్రాక్టర్‌గా ఉన్నా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పనులు చేయడం మాత్రమే తెలుసు. ఇప్పుడు కర్నూలులో పనులు చేయలేని పరిస్థితి ఉంది. ఓ వైపు చేసినా పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నాం. మళ్లీ ఇప్పుడు అధికార పార్టీ నేత అనుచరులంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. భయాందోళనకు గురి చేయడం ఎంతవరకు సమంజసం.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టించుకోని పోలీసులు
బాధితుడు బుధవారం సాయంత్రం తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని, కనీసం ఫిర్యాదు తీసుకోలేదని రంగయ్య వాపోయాడు. న్యాయం కోసం జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ను కలుస్తానన్నారు. తనపై దాడి చేసిన టీడీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతానన్నారు.


