వైద్య ఉద్యోగుల ఆకలి కేకలు! | - | Sakshi
Sakshi News home page

వైద్య ఉద్యోగుల ఆకలి కేకలు!

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

పాత విధానంలోనే జీతాలు ఇవ్వాలి

జీతాల సమస్య

పరిష్కారం అవుతుంది

నిత్యం రోగుల సేవల్లో తరిస్తున్న వారు జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించారు. పదేళ్లుగా వారికి ప్రతి నెలా సక్రమంగా అందుతున్న జీతాలు నాలుగు నెలలుగా ఆగిపోయాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఒక్కో శాఖ ఒక్కో కారణం చెబుతోంది. వైద్య ఆరోగ్య శాఖ నిధి పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉందని చెబితే, ట్రెజరీ శాఖ మాత్రం వారి నియామక ఉత్తర్వులు సరిగ్గా లేవని, అన్ని పత్రాలు సమర్పిస్తే జీతాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు ఎండమావిలా మారుతున్నాయి.

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాంట్రాక్టు విధానంలో దాదాపు 2 వేల మంది స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు ఈ యేడాది మార్చి నుంచి జీతాల రాక ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు వీరికి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు మంజూరయ్యేవి. ఇప్పుడు దాని స్థానంలో నిధి పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. అందులో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంది. వివరాలను అప్‌లోడ్‌ చేయాల్సిన ఉద్యోగులు కొన్ని రోజుల పాటు తీవ్ర జాప్యం చేశారు. వారు అడిగే వివరాలన్నీ తెచ్చి ఇవ్వలేక కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ ఉద్యోగులు నరకయాతన అనుభవించారు. వివరాలు నమోదు చేసి ట్రెజరీకి పంపే ప్రక్రియ ఆలస్యం కావడంతో సమస్య మరింత జఠిలమయ్యింది.

కార్యాలయం చుట్టూ ఉద్యోగులు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జీతాల కోసం స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ ఉద్యోగులు నిధి పోర్టల్‌లో వారి వివరాలు సరిగ్గా నమోదు చేయించుకునేందుకు ఆసుపత్రిలోని పరిపాలనా విభాగం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఇందులో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు, ఈసీజీ టెక్నీషియన్లు, అనెస్తీషియా టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, డయాలసిస్‌ టెక్నీషియన్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆపరేషన్‌ థియేటర్‌ ఉద్యోగులు, బయోమెడికల్‌ ఇంజినీర్లు కలిపి దాదాపు 440 మందికి పైగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిధి పోర్టల్‌ సమస్య ఉన్నా అన్ని చోట్లా పరిష్కారమయ్యింది. కానీ కర్నూలులోనే సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. ఈ విషయమై ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులు మంత్రి టీజీ భరత్‌ను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కొంతకాలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల జీతభత్యాల విషయం కర్నూలు మెడికల్‌ కాలేజీలోని ఏడీ చూస్తున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు ఈ విషయం తమ పరిధిలోనిది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్లర్కులు సైతం వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్టాఫ్‌నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధి పోర్టల్‌ పేరుతో వేధింపులు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో పలు మార్పులు చేశారు. నిధి పోర్టల్‌ ద్వారా జీతాలు చెల్లించాలంటే ముందుగా ఉద్యోగుల నియామక పత్రాలు, కేడర్‌ వివరాలు, శాఖల వారీగా పోస్టుల వివరాలు, అప్పటి రోస్టర్‌ వివరాలు, రోస్టర్‌ నంబర్‌, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నంబర్లు వంటి వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 2016లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అప్పటి అధికారులు 56 మందికిగాను ఏకంగా 156 మందికి పైగా కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అప్పట్లో వివాదం జరిగింది. ఈ క్రమంలో కొందరికి రోస్టర్‌ పాయింట్లు సరిగ్గా ఇవ్వలేకపోవడంతో వివరాలు సక్రమంగా లేవని ట్రెజరీ అధికారులు పలుమార్లు జీతాలు నిలిపినట్లు సమాచారం. ఇప్పుడు కూడా నిధి పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో సమస్య మొదటికి వచ్చింది.

కాంట్రాక్టు ఉద్యోగులకు నాలుగు

నెలలుగా అందని వేతనాలు

ఇబ్బంది పడుతున్న స్టాఫ్‌ నర్సులు,

పారా మెడికల్‌ ఉద్యోగులు

ఉమ్మడి జిల్లాలో 2 వేల మంది

కాంట్రాక్టు ఉద్యోగులు

ట్రెజరీ అధికారుల కొర్రీలు

నియామకపు ఉత్తర్వుల్లో

రోస్టర్‌ పాయింట్లు లేవని మెలిక

శాపంగా మారిన నిధి పోర్టల్‌

అందులో పూర్తి వివరాలను

అప్‌లోడ్‌ చేస్తేనే జీతాలు

పట్టించుకోని అధికారులు

నిధి పోర్టల్‌ పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు. ఈ పోర్టల్‌లో మంజూరైన పోస్టులు, నోటిఫికేషన్‌, రోస్టర్‌ పాయింట్లు వంటి వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు ట్రెజరీ శాఖ అధికారులు మాత్రం రోస్టర్‌ పాయింట్లు లేకుండా గతంలో రిక్రూట్‌ చేశారని, శాంక్షన్‌ పోస్టుల కన్నా ఎక్కువ మందిని నియమించారని చెబుతున్నారు. ఈ గందరగోళం వల్లే జీతాల సమస్య వచ్చి పడింది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ ఉద్యోగులకు పాత సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలోనే జీతాలు ఇవ్వాలి.

–సి.బంగారి, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం కర్నూలు కార్యదర్శి

కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ ఉద్యోగుల జీతాల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ట్రెజరీ శాఖలో సమస్య పరిష్కారం అవుతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాలు వేస్తారు. ఉద్యోగులు పంపిన వివరాలను ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని వివరాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రామాకేర్‌ విభాగం కింద నియామకం పొందిన కొందరు ఉద్యోగులు మాత్రం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. – కృష్ణమోహన్‌,

అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement