కర్నూలు(సెంట్రల్): వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి రైతులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సాగు పద్ధతులపై కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాల అమలులో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంటల వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతోపాటు 5 నుంచి 6 అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. విత్తనాలు నాణ్యత ప్రమాణాలు సాధించలేకపోతే 6ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీ సమయంలో రైతులకు ఫార్మర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసివ్వాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, నేచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి, మార్క్‌ఫెడ్ డీఎం రాజు పాల్గొన్నారు.


