మల్లన్న సేవలో బ్రిగేడ్‌ కమాండర్‌ | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో బ్రిగేడ్‌ కమాండర్‌

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సేనా మెడల్‌ గ్రహీత బ్రిగేడ్‌ కమాండర్‌ రాహుల్‌ మచ్హరాల్‌ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన కమాండెంట్‌ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద ఈఓ ఎం.శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కమాండెంట్‌ దంపతులు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో కమాండెంట్‌ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామి వారి జ్ఞాపికను అందించి సత్కరించారు.

గణేష్‌ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శిగా రమణ

కర్నూలు కల్చరల్‌: ఆంధ్రప్రదేశ్‌ గణేష్‌ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలు నగరానికి చెందిన గోరంట్ల రమణ ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలో సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ గణేష్‌ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శిగా గోరంట్ల రమణను ప్రకటించారు. ఇంతవరక ఆయన పనిచేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి స్థానంలో మాడుగుల నాగఫణి శాస్త్రికి బాధ్యతలు అప్పగించారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా వేణుగోపాల్‌ కొనసాగుతారు. గోరంట్ల రమణ విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన క్రెడాయ్‌ కర్నూలు చైర్మన్‌గా ఉన్నారు. హిందూ ధర్మాన్ని కర్నూలు నగర జిల్లా ప్రజలకు చేరువ చేస్తూ ధర్మ రక్షణలో చురుగ్గా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రేరణ కలిగించడంలో వారి కృషిని హిందూ సమాజం గుర్తించిందనటానికి ఈ బాధ్యత ఒక గుర్తింపని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

కోసిగి: కుటుంబ కలహాలతో కోసిగి రైల్వే స్టేషన్‌ సమీపంలో కిలోమీటర్‌ నంబర్‌ 523/6 వద్ద రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా మృతుడు ఆర్లబండ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఆర్లబండ గ్రామానికి చెందిన మజ్జిగ ఆటో వెంకటరెడ్డి, మహాదేవిల కుమారుడు ఉసేని (23) మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడికి రెండు నెలల క్రితం అక్క కుమార్తె వందగల్లు గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం జరిగింది. ఇష్టం లేని వివాహం చేయడం, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సి.శివరామయ్య వెల్లడించారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు

డోన్‌ టౌన్‌: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు డోన్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నూరుల్లా జైలు శిక్ష విధించారు. పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన పట్టణానికి చెందిన కేఈ సురేంద్రగౌడ్‌, ఎన్‌.నాగరాజులపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. సురేంద్రగౌడ్‌కు మూడు రోజులు, నాగరాజుకు నాలుగు రోజులు జైలు శిక్షలు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

ఇంటి తాళం పగులగొట్టి చోరీ

జూపాడుబంగ్లా: మండల కేంద్రంలోని క్వార్టర్స్‌ కాలనీలో కేజీ రోడ్డు పక్కన ఇంటి తాళం పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహేష్‌బాబు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఉంటున్నారు. అతని ఇంట్లో పనిచేస్తున్న నవీన్‌ సోమ వారం ఉదయం వెళ్లి చూడగా తాళం పెకలించి ఉండటంతో దొంగతనం జరిగినట్లు నిర్ధారించు కుని మహేష్‌కు ఫోన్‌చేసి తెలియజేశారు. అతడి సూచన మేరకు ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువా తలుపులు పెకలించి బంగారం, వెండి వస్తువులను దుండగులు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఏఎస్‌ఐ సంజీవను వివరణ కోరగా ఇంటి యజమాని వచ్చిన తర్వాత ఏఏ వస్తువులు చోరీకి గురయ్యాయో తెలుస్తుందని, ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement