కర్నూలు(సిటీ): తుంగభద్ర నదిపై ఉన్న రాజోలి డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) ఆనకట్టను మంగళవారం కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ బిశ్వాస్, సభ్యులు కేకే జాన్‌గిడ్‌లు సందర్శించారు. ఆర్‌డీఎస్ కాలువకు తమకు కేటాయించిన నీరు రావడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి చేసిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఆనకట్టను, కాల్వను, తెలంగాణ వైపు ఉన్న హెడ్ రెగ్యులేటర్, గేట్లను, ఏపీ వైపు నిర్మాణంలో ఉన్న కుడి కాల్వ నిర్మాణ పనులు, ఆనకట్ట కింది భాగంలో ఉన్న పైపులను పరిశీలించారు. తమకు కేటాయించిన 15 టీఎంసీల నీరు ఆయకట్టుకు అందడం లేదని, ఆనకట్ట దిగువన ఏపీ వైపు వెళ్లే నీటిని బంద్ చేయించాలని తెలంగాణకు చెందిన ఇంజినీర్లు చైర్మన్‌ను కోరారు. అదే విధంగా కర్ణాటక ఇంజినీర్లు ఆర్‌డీఎస్ ఆనకట్ట అర్ధ అడుగు పెంచేందుకు చేపట్టిన పనులు ఏపీకి చెందిన వారు నిలిపివేశారని, దీనివల్ల తమ ఆయకట్టుకు అందాల్సిన నీరు అందడం లేదని చైర్మన్‌కు విన్నవించారు. ఆనకట్ట మీదుగా ఏపీ వైపు వచ్చిన చైర్మన్ ఆనకట్ట దిగువ భాగంలో ఉన్న పైపుల గురించి ఆరా తీశారు. ఆర్‌డీఎస్ కుడి కాలువ కేటాయింపులు, న్యాయస్థానంలో కేసుల వివరాలు చైర్మన్‌కు ఇంజినీర్లు వివరించారు. కేఆర్‌ఎంబీ చైర్మన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నా నికి కేసీ కెనాల్‌కు నీటిని మళ్లించేందుకు నిర్మించిన సుంకేసుల బ్యారేజీని పరిశీలించాల్సి ఉంది. అయితే ఏ కారణం చేతనే తెలియదు కాని చైర్మన్ తన షెడ్యూల్‌ను మార్చుకుని కర్ణాటకలోని రాయచూరు నుంచి హైదరాబాదుకు వెళ్లిపోయారు.


