క్షయ తినమంటోంది... షుగర్‌ వద్దంటోంది! | - | Sakshi
Sakshi News home page

క్షయ తినమంటోంది... షుగర్‌ వద్దంటోంది!

Nov 5 2025 7:45 AM | Updated on Nov 5 2025 7:45 AM

క్షయ

క్షయ తినమంటోంది... షుగర్‌ వద్దంటోంది!

నాలుగేళ్లుగా నమోదైన కేసులు

షుగర్‌ రోగులకు క్షయ ముప్పు!

వేధిస్తున్న జంట వ్యాధులు

డయాబెటిస్‌ నియంత్రణలో లేకపోతే ఇబ్బందులే

రెండు వ్యాధులు ఒకేసారి వస్తే ఆహార నియంత్రణ ప్రధానం

క్షయ, టీబీ ఉన్నప్పుడు ఇన్సులిన్‌ తప్పనిసరి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు, చికిత్స ఉచితం

టీబీ వస్తే ఇన్సులిన్‌ వాడాల్సిందే...

పేరుకే తీపి రోగం. కానీ ఈ వ్యాధి ఒళ్లంతా విషమే. దీనిని అదుపులో ఉంచుకోకపోతే ఒక్కో అవయవాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసుకుంటూ పోతుంది. ఇలా దెబ్బతినే అవయవాల్లో ఊపిరితిత్తులు ప్రధానమైనవి. షుగర్‌ వల్ల వ్యాధినిరోధకశక్తి తగ్గి మరో మహమ్మారి క్షయకు దారితీస్తుంది. ఈ క్షయ తగ్గాలంటే బాగా తినాలని వైద్యులు చెబుతారు. బాగా తింటే షుగర్‌ నియంత్రణలో ఉండదు. ఈ జంట వ్యాధులున్న వారు మితంగా తింటూ చికిత్స తీసుకుంటేనే అవి దారికి వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): క్షయ వ్యాధి వచ్చిందంటే ఒకప్పుడు ఊరికి దూరంగా ఉంచేవారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని భయపడేవారు. ఊరి చివరలో ఒక గదిలో ఉంచి వైద్యం అందించేవారు. కాలక్రమేణా ఆధునిక మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధి త్వరగా నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా రోగి త్వరగానే కోలుకుంటున్నాడు. ఇప్పుడు కూడా క్షయ వ్యాధిగ్రస్తుడు పక్కనుంటే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ వ్యాధి తాలూకు బ్యాక్టీరియా విస్తరించి ఇతరుల్లోకి వెళ్తుంది. కానీ వ్యాధినిరోధక శక్తి తగ్గితేనే ఆ ఇతరుల్లో క్షయగా మారుతుంది. అవగాహన కార్యక్రమాలు, ఆధునిక మందుల వల్ల క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి ఇతరులకు వ్యాధి విస్తరించకుండా అడ్డుకుంటున్నారు.

షుగర్‌ వ్యాధి అదుపులో క్షయ...!

ఇటీవల కాలంలో షుగర్‌ వచ్చిన వారిలోనూ క్షయ కనిపించడం సాధారణంగా మారింది. ఇలాంటి కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా క్షయ రోగుల మాదిరిగా ఇది పోషకాహారం బాగా తింటే త్వరగా నియంత్రణలోకి వస్తుంది. కానీ షుగర్‌ ఉన్న వారికి క్షయ వస్తే మాత్రం అంత త్వరగా లొంగదు. చాలా మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడకపోవడం, వాడినా ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల వారిలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటం లేదు. కొంత మందికి తినకముందు 200లకు పైగా, తిన్నాక 350 నుంచి 400లకు పైగా షుగర్‌ స్థాయిలు ఉంటున్నాయి. ఇలాంటి వారిలో అధికంగా క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. షుగర్‌ నియంత్రణలో ఉంటేనే క్షయ కూడా తగ్గుతుంది. క్షయ తగ్గాలంటే మంచి పౌష్టికాహారం తినాలి. షుగర్‌ రోగుల్లో అయితే ఆహారం అధికంగా తీసుకుంటే షుగర్‌ నియంత్రణలో ఉండదు. ఈ రెండు వ్యాధులను సమన్వయం చేసుకుంటూ చికిత్స తీసుకుంటేనే అవి దారికి వస్తాయి.

వీరికి క్షయ వచ్చే అవకాశం ఎక్కువ

సాధారణంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో క్షయ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాలు, స్మోకింగ్‌, పొగాకు ఉత్పత్తులు వాడేవారు, పలు పరిశ్రమల్లో పనిచేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, కాలేయ, కిడ్నీ ఫెయిల్యూర్‌ అయిన వారు, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులతో పాటు గర్భిణిలు, బాలింతలు, శిశువులు, పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. క్షయ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.

నమోదు కాని కేసులెన్నో !

ఇప్పటికే షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారికి క్షయ వ్యాధి వచ్చిందంటే వారు ప్రభుత్వ ఆసుపత్రులకు రావడం లేదు. నేరుగా ప్రైవేటు వైద్యుల క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా అధికారిక లెక్కల్లో వీరి వివరాలు పూర్తిగా నమోదు కావడం లేదు. టీబీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తనకున్న జబ్బు అందరికీ తెలిసి పోతుందనే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఈ కారణంగానే డబ్బులు ఖర్చు అయినా ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే టీబీ/షుగర్‌ రోగుల సంఖ్య 30 శాతానికి పైగానే ఉంటుంది.

క్షయ వ్యాధిగ్రస్తులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాము. క్షయ రోగితో పాటు ఇంట్లో ఉన్న వారికీ టీబీ నిర్ధారణ పరీక్షలతో పాటు సీవైటీబీ స్కిన్‌ టెస్ట్‌ చేయిస్తున్నాము. అంతర్గత టీబీ ఉంటే వారికి టీబీ రాకుండా ఉండే మందులు ఇస్తున్నాము. ప్రతి రోగికి పౌష్టికాహారం అందించేందుకు నెలకు రూ.1000 చొప్పున ఆరు నెలలకు రూ.6 వేలు ఇస్తున్నాము. వీరికి నిక్షయ మిత్ర ద్వారా పౌషకాహార కిట్లను సైతం అందిస్తున్నాము. క్షయ రోగిని గుర్తించి చెప్పిన వైద్యులకు ఒక కేసుకు రూ.500 ఇస్తున్నాము.

–డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌, డీఎంహెచ్‌ఓ, కర్నూలు

డయాబెటీస్‌ రోగులకు క్షయ సోకితే తప్పనిసరిగా వారు ఇన్సులిన్‌ వాడాలి. క్షయ ఉన్న వారు ఆహారం బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో షుగర్‌ రీడింగ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల షుగర్‌ నియంత్రణలో ఉండదు. ఇది నియంత్రణలో లేకపోతే క్షయ కూడా తగ్గదు. దీనివల్ల షుగర్‌ ఉన్న వారికి క్షయ వస్తే అలాంటి వారికి ఇన్సులిన్‌ వాడాలని సూచిస్తాము. ఒకవైపు షుగర్‌కు ఇన్సులిన్‌, మరోవైపు క్షయ వ్యాధి మందులు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పక వాడుతూ ఉంటే రెండు వ్యాధులూ నియంత్రణలోకి వస్తాయి.

–డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, టీబీ మెడికల్‌ ఆఫీసర్‌, కర్నూలు

క్షయ తినమంటోంది... షుగర్‌ వద్దంటోంది! 1
1/2

క్షయ తినమంటోంది... షుగర్‌ వద్దంటోంది!

క్షయ తినమంటోంది... షుగర్‌ వద్దంటోంది! 2
2/2

క్షయ తినమంటోంది... షుగర్‌ వద్దంటోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement