పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఆలూరు రూరల్: పాల వ్యాన్ ఢీ కొని తుమ్మలబీడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. హులేబీడు గ్రామంలోని హైవే 167లో మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని తుమ్మలబీడు గ్రామానికి చెందిన దేవేంద్ర (40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఆకు కూరలు విక్రయించడానికి ఆదోనికి వెళ్తున్న తన తల్లి ఈరమ్మను తుమ్మలబీడు నుంచి హులేబీడుకు స్కూటర్‌పై తీసుకొచ్చాడు. ఆటోలో ఎక్కించి రోడ్డు పక్కన నిలబడిన దేవేంద్రను ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న పాల వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య కుమారి, ఇద్దరు కుమారులు సంతానం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మన్మథ విజయ్ విలేకరులకు తెలిపారు.


