
ఘనంగా స్నాతకోత్సవం
కర్నూలు సిటీ: స్థానిక జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో నాల్గొవ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2021–25 బ్యాచ్ బీటెక్, 2023–25 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థిని, విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను వీసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నప్పటికీ తల్లిదండ్రుల త్యాగాలను విస్మరించకూడదన్నారు. బీటెక్‌లో ఏ బ్రాంచ్‌లో చదివినా విషయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే ఏదైనా సాధిస్తారని సూచించారు. కృత్రిమ మేధా కన్నా మానవ మేధనే గొప్పదన్నారు. క్వాంటం కంప్యూటరింగ్ రాబోయే రోజుల్లో అన్ని బ్రాంచ్‌ల్లో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆసియాలోనే మొట్టమొదటిసారి అమరావతిలో నెలకొల్పబోతుందన్నారు. జేఎన్‌టీయూ పరిధిలో జి.పుల్లయ్య కాలేజీ అత్యుత్తమ విద్యను అందిస్తుందన్నారు. రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య మాట్లాడుతూ.. జీవితానికి పునాదులు పడే కాలేజీ దశలో శ్రద్ధగా చదువు కోవాలన్నారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్ మాట్లాడారు. కాలేజీలో వివిధ బ్రాంచ్‌ల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. కార్యక్రమంలో ఆ కాలేజీలోని అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా స్నాతకోత్సవం