
‘స్టాండింగ్’ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం!
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం దాదాపు పూర్తయ్యింది. ఇక ఎన్నిక లాంఛనమే అయ్యింది. స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్ల పర్వం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. గడువు ముగిసిన నాటికి వైఎస్సార్‌సీపీ చెందిన కార్పొరేటర్లు ఈ. నారాయణ రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, సీహెచ్ సాంబశివరావు, కురుబ మునెమ్మ, షేక్ అహమ్మద్, దండు లక్ష్మీకాంతా రెడ్డి, పి.షాషావలీ తమ నామినేషన్లు దాఖలు చేశారు. స్టాండింగ్ కమిటికీ ఐదుగురు సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. అయితే వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు మద్దతుగా తమ నామినేషన్లు సమర్పించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణకు స్టాండింగ్ కమిటీకి పోటీచేసే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తమ నామినేషన్లు సమర్పించారు. డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, వైఎస్సార్‌సీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, కార్పొరేటర్లు చిట్టెమ్మ, రాజేశ్వర రెడ్డి, క్రిష్ణ కాంత్, విక్రమసింహారెడ్డి, నాగలక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్లను ఈనెల 25న పరిశీలిస్తారు. అదే రోజు స్టాండింగ్ కమిటీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈనెల 28 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు 1వ తేదీ ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు విజయం సాధించిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు.
టీడీపీకి ఓటమి భయం
నాలుగు సంవత్సరాల పాటు స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తూ వచ్చింది. టీడీపీకి 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్, మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో కౌన్సిల్‌లో వారి బలం 20 కి చేరుకుంది. దీంతో గత ఏడాది జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లను బరిలోకి దించింది. వీరికి మంత్రి టీజీ భరత్, పాణ్యం, కోడుమూరు అర్బన్ ప్రజా ప్రతినిధులు అండగా నిలిచినా ఓటమి పాలయ్యారు. ఓటమి భయంతో ఇద్దరు కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీలో నిలపాలని నిర్ణయించారు. నామినేషన్లు వేసేందుకు టీడీపీ కార్పొరేటర్లు పరమేష్, అబ్బాస్, ఫరాజ్ ఖాన్, కై పా పద్మాలతారెడ్డి తరలి వచ్చారు. ఇద్దరితో దరఖాస్తు పూర్తి చేయగా.. ఓ నేత ఫోన్ చేసి వద్దంటూ వారించారు. దీంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఏకగ్రీవం
స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. బరిలో ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు పరిచారు. పోటీ చేస్తున్నట్లు హడావుడి చేసిన తెలుగుదేశం పార్టీ బరిలో నుంచి ఉపసంహరించుకుంది. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఏకగ్రీవం కానున్నారు.
కర్నూలు కార్పొరేషన్‌లో
స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
ముగిసిన నామినేషన్ల పర్వం
నామినేషన్లు వేసిన ఏడుగురు
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
ఓటమి భయంతో దూరంగా టీడీపీ