
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
కర్నూలు (టౌన్): యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని తన చాంబర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు 1,500 టన్నుల యూరియా వస్తే 50 శాతం మార్కెఫెడ్‌కు, 50 శాతం ప్రెవేటు డీలర్లకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే జిల్లాకు వచ్చిన మొత్తం యూరియాను ప్రెవేటు డీలర్లకు ఇవ్వడంతో వారు బ్లాక్ మార్కెట్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. వివిధ పంటలు సాగు చేసిన రైతులు యూరియా దొరకక ధర్నాలు చేయాల్సి వసోందన్నారు. నెల్లూరు నుంచి లారీల్లో యూరియాను తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా రైతులు సైతం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను నష్టాల్లో ముంచుతోందన్నారు.
అమరావతి తప్ప ఏమీ కనిపించవా?
కూటమి ప్రభుత్వానికి అమరావతి నిధులు రూ.లక్ష కోట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదా అని ఎస్వీ ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం అమరావతి జపం చేస్తున్నారని విమర్శించారు. రూ. లక్ష కోట్లలో 7 వేల కోట్లు కమీషన్ వస్తుందన్న కారణంతోనే ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారనే అనుమానాలు వస్తున్నాయన్నారు. అన్నదాతలకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా పర్యటించరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులతో కలిసి పోరాటం చేస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి