
ఐచర్ వాహనం దగ్ధం
వెల్దుర్తి: అగ్ని ప్రమాదంలో ఐచర్ వాహనం దగ్ధం కాగా అందులో నిద్రిస్తున్న చిన్న అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ దుర్ఘటన పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తన స్థలంలో వెల్దుర్తికి చెందిన చాకలి మధు ఆదివారం రాత్రి రెండు ఐచర్ వాహనాలు, మూడు ఆటోలు పార్కింగ్ చేసి ఉంచారు. ఒక ఐచర్ వాహనం క్యాబిన్‌లో మధు కుటుంబీకుడు చిన్న నిద్రించాడు. ఈ స్థలంలో పాత టైర్లు 32 దాకా పేర్చి ఉంచారు. రాత్రి 11గంటల ప్రాంతంలో టైర్లు అంటుకుంటూ, పక్కనే ఉన్న సంపూర్ణ ఇండేన్ గ్యాస్ భవనం వెనుకభాగానికి, స్థలంలో ఉన్న ఐచర్ వాహనానికి అగ్ని రాజుకుంది. గమనించిన చుట్టుపక్కల వాసులు యజమానులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వాహనంలో ఉన్న చిన్నను నిద్రలేపి బయటకు తీశారు. స్థానికులు, డోన్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో మధుకు చెందిన ఐచర్ వాహనం ఇంజన్, క్యాబిన్ పూర్తిగా దగ్ధమై రూ.10 లక్షల మేర నష్టం కలిగింది. సంపూర్ణ ఇండేన్ గ్యాస్ భవనం పాక్షికంగా దెబ్బతింది. ఎవరో కావాలని చేసినదేనన్న అనుమానాన్ని బాధిత మధు కుటుంబం ఆరోపిస్తుండగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు.
వాహనంలో నిద్రిస్తున్న వ్యక్తి క్షేమం