సాయం ఎప్పుడనే గందరగోళం
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. కృష్ణా జిల్లాలోని 25 మండలాలకు ఎనిమిదింటిని తీవ్ర కరువు మండలాలుగా, మరో తొమ్మిదింటిని మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది. అయితే కరువు తీవ్రత ఉన్న ప్రాంతాలను రెండు కేటగిరీలుగా విభజించడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిగిలిన మండలాల్లో వర్షాభావం, సాగునీటి కొరత ఉండటంతో వాటిని కూడా కరువు జాబితాలో చేర్చాలని రైతులు కోరుతున్నారు. అయితే సాయంపై స్పష్టత లేదు.
ఇన్నాళ్లకు ప్రకటన
జూన్ నుంచే వర్షపాతం లోటుతో పంటల పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నా.. కరువు మండలాల ప్రకటన అక్టోబరు వరకు సాగడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో ప్రభుత్వం ఏరువాక కార్యక్రమాలు నిర్వహించి సాగుకు సన్నద్ధం కావాలని సూచించడంతో పెట్టుబడులు లేకపోయినా అప్పులు చేసి సాగు చేపట్టామని రైతులు చెబుతున్నారు. అనంతరం సాగునీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడులు పెట్టిన పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సింది పోయి రైతులను నిర్లక్ష్యంగా వదిలేసిందనే విమర్శలు ఎదురవుతున్నాయి.
శివారు భూములకు సాగునీటి కష్టాలు
శివారు ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని పాలకులు ఇచ్చిన హామీలతో సాగుకు సిద్ధమైన రైతులకు చివరకు నీటి కొరత ఎదురైందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసిన తర్వాత కూడా సాగునీరు అందక పంటలు దెబ్బతిన్నాయని రైతులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన తీవ్ర కరువు మండలాల్లో కృత్తివెన్ను, బంటుమిల్లి, చల్లపల్లి, నాగాయలంక, కోడూరు, పెడన, గూడూరు, మచిలీపట్నం నార్త్ ఉన్నాయి. మధ్యస్థ కరువు మండలాలుగా బాపులపాడు, ఉంగుటూరు, నందివాడ, పెనమలూరు, పమిడిముక్కల, గుడ్లవల్లేరు, మోపిదేవి, అవనిగడ్డ, తోట్లవల్లూరు మండలాలను ప్రకటించారు. జిల్లాలోని మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలతో సరి పెడుతోంది కానీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
కరువు మండలాల్లోని రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం తక్షణమే అందించాలి. నాట్లు వేసి సాగునీరు అందక పంటలు ఎండిపోయిన రైతులకు కూడా పరిహారం ఇవ్వాలి. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం.
–గౌరిశెట్టి నాగేశ్వరరావు,
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
కరువు మండలాల ప్రకటన వెలువడినా.. రైతులకు అందించే నష్టపరిహారం, ఇతర ఉపశమన చర్యలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన నెలకొంది. కరువు ప్రకటించిన మండలాల్లోనే కాకుండా సాగునీరు అందక పంటలు దెబ్బతిన్న ఇతర ప్రాంతాల రైతులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కరువు మండలాల ప్రకటనతో సరిపెట్టకుండా రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. పంట రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. మచిలీపట్నం సౌత్ మండలంలోని సాగునీరు అందని గ్రామాలను కూడా కరువు ప్రభావిత ప్రాంతాలుగా పరిగణించాలి.
–జన్ను రాఘవరావు,
జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు మాజీ చైర్మన్


