వార్డుల విభజనలో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

వార్డుల విభజనలో గందరగోళం

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

భార్యాభర్తలు వేర్వేరు వార్డుల్లో..

పెడనలో కొత్త వార్డుల ఓటరు జాబితాల్లో తప్పుల తడకలు

భార్య ఒక వార్డులో.. భర్త మరో వార్డులో!

నలుగురు పిల్లలు ఒకచోట.. తల్లిదండ్రులు మరోచోట

ఓటు వేసే సమయంలో ఇబ్బంది తప్పదంటున్న పురప్రజలు

చాలా దారుణంగా జాబితాలు రూపొందించారు

ఎన్నికల సంఘం అవకాశం ఇస్తే సరిచేస్తాం

భార్యాభర్తలు వేర్వేరు వార్డుల్లో..

పెడన: పెడన మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అనంతరం విడుదలైన కొత్త ఓటరు జాబితాలు ఇబ్బందికరంగా మారాయి. వాటిలో కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయేలా పేర్లు నమోదయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలను వేర్వేరు వార్డుల్లో చేర్చడం, తల్లిదండ్రులను ఒక వార్డులో.. పిల్లలను మరో వార్డులో చూపించడం వంటి తప్పులు చోటుచేసుకున్నాయని పురప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్‌ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వార్డుల పునర్విభజన అనంతరం ఆయా ప్రాంతాల భౌగోళిక పరిధికి అనుగుణంగా ఓటర్లను కేటాయిస్తారు. అయితే పెడనలో విడుదలైన కొత్త జాబితాల్లో ఓటర్ల కేటాయింపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో కనిపించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు పదుల సంఖ్యలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఓటు వేసే సమయంలో ఇబ్బందులే..

ప్రస్తుతం తాము ఏ వార్డులో ఉన్నామనే విషయంపై చాలామంది ఓటర్లకు స్పష్టత లేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు అసలు సమస్య బయటపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలోని సభ్యులు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో ఓటర్లలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని అంటున్నారు.

అధికార పార్టీ నేతలపై విమర్శలు

ఓటరు జాబితాల్లో ఇంతటి గందరగోళం కనిపిస్తున్నా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించేందుకు చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

కొత్త 11వ వార్డులో సీరియల్‌ నంబర్లు 902, 903లో అబ్దుల్‌ఖాదర్‌, ఆయన భార్య మెహెరున్నీసా పేర్లు నమోదయ్యాయి. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలైన షేక్‌ ఇబ్రహీం, షేక్‌ ఇమ్రాన్‌, జరీనాబేగం, షేక్‌ తశ్లీం పేర్లు కొత్త 27వ వార్డులో సీరియల్‌ నంబర్లు 47 నుంచి 50 వరకు నమోదయ్యాయి. దీంతో తల్లిదండ్రులు ఒక వార్డులో.. నలుగురు పిల్లలు మరో వార్డులో ఉన్నట్లుగా జాబితాలో కనిపిస్తోంది. అదేవిధంగా 27వ వార్డులో అబ్దుల్‌ ఆసీఫ్‌, ఆయన కుమారుడు అబ్దుల్‌ నయీమ్‌, భార్య సగేరాబేగం పేర్లు నమోదయ్యాయి. అయితే ఆయన కుమార్తె సుహాన పేరు మాత్రం కొత్త 11వ వార్డులో సీరియల్‌ నంబరు 791లో ఉంది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు ఇలా వేర్వేరు వార్డుల్లో ఉండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎండీ ఖాజా తల్లి మెహెరున్నీసా పేరు కూడా వేరే వార్డులో నమోదైనట్లు పేర్కొంటున్నారు. ఖాజా ఓటు 11వ వార్డులో ఉండగా, ఆయనతోనే ఉంటున్న తల్లి మెహెరున్నీసా ఓటు 27వ వార్డులో ఉన్నట్లు జాబితాలో నమోదైంది. ఇక 27వ వార్డులో సీరియల్‌ నంబరు 802లో ఉన్న అబ్దుల్‌ లతీఫ్‌ భార్య హాబీబున్నీసా పేరు 11వ వార్డులో 106వ సీరియల్‌ నంబరులో ఉంది. అలాగే అబ్దుల్‌గనీ పేరు 27వ వార్డులో 98వ సీరియల్‌ నంబరులో ఉండగా, ఆయన భార్య నూరున్నీసా పేరు 11వ వార్డులో 800వ సీరియల్‌ నంబరులో నమోదైంది. కరీమున్నీసా పేరు 27వ వార్డులో 107వ సీరియల్‌ నంబరులో ఉండగా, ఆమె భర్త అబ్దుల్‌ హామీద్‌ పేరు 11వ వార్డులో 803వ సీరియల్‌ నంబరులో ఉంది.

ఓటరు జాబితాలు పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండాలి. ఒకే కుటుంబంలోని సభ్యులంతా ఒకే ప్రాంతంలో ఉండేలా జాబితాలు రూపొందించాల్సి ఉండగా, భర్త ఒక వార్డులో.. భార్య మరో వార్డులో, తల్లిదండ్రులు ఒకచోట.. పిల్లలు మరోచోట ఉండేలా జాబితాలు రూపొందించడం సరికాదు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి తప్పులను సరిచేయాలి.

–మెహరాజున్నీసా, పట్టణ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ, పెడన

నిబంధనల మేరకు ఆన్‌లైన్‌ విధానంలో కొత్త వార్డుల ఓటరు జాబితాలను రూపొందించాం. డోర్‌ నంబర్ల నమోదులో చిన్నపాటి పొరపాట్లు జరిగినా ఓటర్ల కేటాయింపులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. జాబితాల్లోని తప్పులను సరిచేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తే వాటిని సరిచేస్తాం. అవకాశం లేకపోతే ప్రస్తుతం విడుదల చేసిన జాబితాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

–ఎం. సాంబశివరావు,

టీపీవో, పెడన మున్సిపాలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement