పెనుగంచిప్రోలు: మండలంలోని ముండ్లపాడు గ్రామంలో బాలుడి హత్య కేసులో నిందితురాలైన అతని తల్లి నెల్లూరు సుజాతకు బుధవారం నందిగామ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు ఎస్‌ఐ అర్జున్ తెలిపారు. ప్రాసిక్యూషన్ ఆధారాల ప్రకారం.. 2017, మే 22న గ్రామానికి చెందిన నిందితురాలి మూడు సంవత్సరాల కుమారుడు అశోక్‌ను చంపి.. అనంతరం మృతదేహాన్ని సమీపంలో కాలువలో పడవేసి నేరాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం విషప్రయోగం కారణంగానే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. ఆస్తి కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. దర్యాప్తు అధికారులుగా అప్పటి ఎస్‌ఐ అవినాష్, సీఐ వైవీఎల్ నాయుడు సాక్షమిచ్చారు. సమర్పించిన మౌఖిక, డాక్యుమెంటరీ, వైద్య, శాసీ్త్రయ ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితురాలు సుజాతను దోషిగా నిర్ధారించి, శిక్షలు విధించింది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5000 జరిమానా, జరిమానా చెల్లించకపోతే 6 నెలల సాధారణ కారాగార శిక్ష, ఐపీసీ 201 ప్రకారం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2000 జరిమానా, జరిమానా చెల్లించకపోతే 6 నెలల సాధారణ కారాగార శిక్ష.. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని కోర్టు ఆదేశించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: బందరు సర్వజన ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో కార్నియా (నల్లగుడ్డు) మార్పిడి శస్త్రచికిత్సలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి. భానుమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ కోసం జీజీహెచ్ నేత్ర విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణకు బెంగళూరులోని మింటో నేత్ర వైద్యశాలలో ఈనెల ఒకటి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు శిక్షణ పొందేందుకు అనుమతి లభించిందన్నారు. శిక్షణ అనంతరం జీజీహెచ్‌లో కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో అంధత్వ నివారణ కార్యక్రమాలను విస్తృతం చేయడంతోపాటు కేటరాక్ట్ ఆపరేషన్లలో రాష్ట్ర స్థాయిలో 8వ స్థానం, స్కూల్ ఐ స్క్రీనింగ్‌లో 3వ స్థానం సాధించినట్లు భానుమూర్తి తెలిపారు. నేత్రదానంలో 510 శాతం ప్రగతితో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. మచిలీపట్నం జీజీహెచ్‌లో జిల్లాలో తొలిసారిగా ఐ డొనేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లో 500కు పైగా నేత్రాలను సేకరించినట్లు తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు సెక్రటరీగా బి. సుమైల మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె గతంలో సిద్ధార్థ వైద్య కళాశాలలో అడ్మినిష్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఫారిన్ సర్వీసుపై రెండేళ్ల కాల పరిమితితో 2024 అక్టోబరులో పారామెడికల్ బోర్డు సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరుతో కాలపరిమితి ముగియనుంది. ఈ తరుణంలో మరో రెండేళ్లు ఆ పదవిలో కొనసాగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.


