చల్లపల్లి: కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలైన ఘటన 216 జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామానగరం అడ్డరోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపిదేవి మండలం మోపిదేవిలంక గ్రామానికి చెందిన దేవనబోయిన సాంబశివరావు(65) తన మోపెడ్‌పై బుధవారం ఉదయం ఘంటసాల వెళ్లి పెయింటర్ అవనిగడ్డ బాలశ్రీనివాసరావును ఎక్కించుకుని తిరుగు పయనమయ్యాడు. రామానగరం క్లబ్ రోడ్డు నుంచి చైతన్య స్కూల్ మీదుగా హైవే ఎక్కే క్రమంలో మోపిదేవి వైపు నుంచి మచిలీపట్నం వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో మోపెడ్ నుంచి సాంబశివరావు, బాలశ్రీనివాసరావు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరినీ 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో సాంబశివరావు మార్గమధ్యలోనే మృతి చెందారు. బాలశ్రీనివాసరావును మచిలీపట్నం తీసుకువెళ్లి అటు నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసి ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


