తిరువూరు: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు అక్టోబర్ 3, 4వ తేదీల్లో తిరువూరులో జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నాగుబండి విశ్వేశ్వరరావు బుధవారం తెలిపారు. తిరువూరు బైపాస్‌రోడ్డు సెంటర్లోని నాగుబండి రామారావు మెమోరియల్ కన్వెన్షన్‌లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో సీ్త్ర పురుషులకు వేర్వేరుగా ఈ పోటీలు జరుగుతాయని, వివరాలకు 9490333249 నంబరులో సంప్రదించాలని కోరారు.
ఇబ్రహీంపట్నం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపికలు ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ కళాశాల క్రికెట్ మైదానంలో నిర్వహించారు. క్రికెట్ సెలెక్షన్స్‌ను కళాశాల ప్రిన్సిపాల్ జాఫర్ సాధిక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 200మంది బాల బాలికలు ఈ పోటీలో పాల్గొని తమ సత్తాచాటారన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వి .రవికాంత్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికై న జట్లు త్వరలో తిరుపతిలో జరగనున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 స్టేట్ మీట్‌లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. సెలెక్టర్లుగా సుందర్, అవినాష్, రఘురాం, కె.వి నారాయణ, శివలక్ష్మి వ్యవహరించారు.
పెనమలూరు: ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్లేస్‌మెంట్ అవార్డు–2026 సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో పని చేస్తున్న డీన్ ఇండస్ట్రీయల్ రిలేషన్ అండ్ ప్లేస్‌మెంట్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ డి.రాజేశ్వరరావుకు వచ్చింది. ఇటీవల జైపూర్‌లో జరిగిన ఎడ్యూస్కిల్స్ కనెక్ట్–2026లో జాతీయ స్థాయి పురస్కారాన్ని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదగా అందుకున్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించటం, పరిశ్రమలతో విద్యా సంస్థలను అనుసంధానం చేయటం, ప్లేస్‌మెంట్ కార్యక్రమం సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించటంతో రాజేశ్వరరావు చేసిన కృషికి అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా వర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) ఆధ్వర్యంలో అండర్–14 బాలుర జట్టు ఎంపికలను నిర్వహిస్తున్నామని కేడీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం. రవీంద్ర చౌదరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2022, సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత 2014, ఆగస్టు 30వ తేదీకి ముందు జన్మించిన వారు ఈ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులని వివరించారు. ఈ నెల 3వ తేదీ (శనివారం) ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00గంటల లోపు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణ లోని కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని క్రికెట్ మైదానంలో ఆదివారం ఉదయం 8.00గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.
విద్యుత్ తీగలు తెగిపడి
పాల వ్యాన్ దగ్ధం
అబ్దుల్లాపూర్‌మెట్(హైదరాబాద్):
నిలిపి ఉన్న పాల వ్యాన్‌పై విద్యుత్ తీగ తెగి పడడంతో మంటలు అంటుకుని దగ్ధమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన చింతకుంట జయరాజ్ విజయా మిల్క్స్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం విజయవాడ నుంచి ఎల్‌బీనగర్‌కు వ్యాన్‌లో పాలు తీసుకుని వస్తాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరిన జయరాజ్ బుధవారం ఉదయం ఎల్‌బీనగర్‌లో పాలను అన్‌లోడ్ చేసి మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు వెళ్తుండగా బాటసింగారం పండ్ల మార్కెట్ సమీపంలో టీ తాగేందుకు ఆగాడు. జయరాజ్ టీ తాగి వచ్చేసరికి మిల్క్ వ్యాన్‌కు మంటలు అంటు కున్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ తీగ తెగి పడటంతోనే వ్యాన్ కాలిపోయిందని గుర్తించారు. జయరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


