తాత పద్యంపై గాంధీ ప్రశంస..
గుడ్లవల్లేరు: హేతువాద శిఖరం.. కలమే కరవాలమైన భావ విప్లవకారుడు.. తెలుగు సాహితీ ధ్రువతార, కుల వివక్ష, మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలను తన రచనల ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించిన సంఘ సంస్కర్త, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి. ప్రశ్నకు పట్టం కట్టిన ఆయన రచనలను, ఆయన భావజాలాన్ని నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా అక్టోబర్ మూడో తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో యువజన సదస్సును నిర్వహిస్తున్నారు. రామస్వామి తెనాలి మునిసిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా దీనికి అనుసంధానంగా ఆయన జన్మస్థలమైన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు నుంచి తెనాలి వరకు చైతన్యయాత్రకు గురువారం శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో కవిరాజు మనుమలు, విశిష్ట రచయిత గోపీచంద్ తనయుడు సినీ నటులు త్రిపురనేని సాయిచంద్ ఈ చైతన్య యాత్ర నిర్వహించనున్నారు.
సంఘ సంస్కర్త కవిరాజు..
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో 1887 జనవరి 15న జన్మించారు. ‘జంబుక వథ’, ‘సూత పురాణం’, ‘ఖూనీ’ వంటి రచనలతో సంప్రదాయ భావజాలంపై తనదైన తర్కబద్ధమైన కవిరాజు కలం సమాజ మార్పు కోసం విమర్శను వ్యక్తం చేశారు. మచిలీపట్నం హిందూ కాలేజీలో ప్లీడర్‌గా చదువుతున్న కవిరాజును నీవు శూద్రుడవంటూ.. మరొక విద్యార్థి బయటకు నెట్టారు. అప్పుడాయన కలం నుంచి జాలువారిన ‘జంబుక వథ’ తెలుగులో సాంస్కృతిక విప్లవానికి నాంది పలికింది. అనంతరం స్వాతంత్రోద్యమానికి ఊపిరులు ఊదుతూ.. ’వీరగంధము తెచ్చినారము’ అంటూ తన రచనలతో పోరాటానికి కొత్త ఊపు తెచ్చారు.
పత్రికా సంపాదకుడిగా..
‘రైతు’ దినపత్రికకు సంపాదకుడిగా 1922లో తెనాలికి చేరారు. మరో వైపు న్యాయవాదిగా కొనసాగుతూనే సంస్కరణోద్యమాన్ని తలకెత్తుకున్నారు. తెనాలిలోని తన ఇంటిని ‘సూతాశ్రమం’గా మార్చారు. హేతువాద సమరానికది కార్యక్షేత్రమైంది. రెండుసార్లు తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా త్రిపురనేని ఎన్నికయ్యారు.
కవిరాజుగా సత్కారం..
1929లో చైన్నెలోని ఆంధ్ర మహాసభ రామస్వామిని ‘కవిరాజు’గా సత్కరించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి ప్రజలపై సామూహిక జరిమానా విధించారు. ఆ వేధింపులపై 1943 జనవరిలో తెనాలి సభలో కవిరాజు మాట్లాడారు. తర్వాత అనారోగ్యానికి గురై అదే నెల 16న కన్నుమూశారు. భారత ప్రభుత్వం 1987లో తపాల స్టాంప్ విడుదల చేసింది.
తాత కవిరాజు రాసిన వీరగంధం తెచ్చినారము పద్యాన్ని గాంధీజీ ప్రశంసించారు. ఆనాటి ఉద్యమ సభల్లో ఆ పద్యాన్ని చదివి పోరాటాన్ని చైతన్య పరిచాలని బాపూజీనే నాయకులకు సూచించారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా తాత రచనల్ని కొండవీటి వెంకట కవి ద్వారా ఆచరించి దానవీరశూర కర్ణ, సీతారామ కల్యాణం వంటి సినిమాలు తాత రచనల ప్రభావంతో వెలువడినవే.
– త్రిపురనేని సాయిచంద్, సినీ నటుడు, కవిరాజు మనవడు


