గన్నవరం: విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని అల్లాపురంలో ఎయిర్‌పోర్ట్ విస్తరణలో ప్లాట్లు కోల్పోయిన నిర్వాసితులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించిన ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏబీ మాట్లాడుతూ 2014–19 మధ్య విమానాశ్రయ విస్తరణ కోసం రైతుల నుంచి పంట పొలాలు, లే అవుట్లలోని ప్లాట్లను, పేదల ఇళ్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం సమీకరించిందన్నారు. అమరావతి రైతులకు ఇచ్చినట్లుగా పరిహార ప్యాకేజీ, ప్లాట్లు ఇస్తామనే హామీలను నెరవేర్చకుండానే అప్పటి ప్రభుత్వం దిగిపోయిందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అజ్జంపూడిలో ప్లాట్ల అభివృద్ధికి రూ. 120కోట్లు కేటాయించినప్పటికీ నిధులు విడుదల చేయలేదన్నారు. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా విమానాశ్రయ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యాపార ప్రయోజనాలు తప్ప, ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయకుండా, ఉన్న విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకుండా, అమరావతిలో మళ్లీ కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఐదు వేల ఎకరాల్లో కార్పొరేట్ సంస్థలకు దొచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్లాట్ల యాజమానుల సంఘ ప్రతినిధి వేదవతి పాల్గొన్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు


