వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్నికల వేళ పేదలకు ఇళ్ల పట్టాభిషేకం పేరుతో విజయవాడలో నిర్వహించిన ఆర్భాటపు సభలో చంద్రబాబు చెప్పినవన్నీ భూటకపు మాటలేనని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రస్తుతం పంపిణీ చేస్తానన్న 24,042 పట్టాల్లో 21,456 పట్టాలు గత ప్రభుత్వంలో ఇచ్చినవేనని ఆయన పేర్కొన్నారు. కేవలం 2,586 మాత్రమే కూటమి పట్టాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటికే పెద్ద ఎత్తున సభ పెట్టి, ప్రజా ధనంతో బస్సుల్లో ప్రజలను తరలించడం అవసరమా అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు, ఇప్పటి వరకూ చంద్ర బాబు 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎప్పుడైనా పేదలకు ఇళ్లస్థలాల కోసం సెంటు భూమి ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలనే తాము ఇస్తున్నట్లు అబద్దాలు వల్లె వేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో లక్ష మంది పేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పట్టాభిషేకం అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. అంతేకాదు తనకు తానే వాటర్ మ్యాన్ అనే బిరుదు ఇచ్చుకున్నారని, రాష్ట్రంలో ఆయన కట్టిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని అవినాష్ ప్రశ్నించారు. ఆయన వాటర్ మ్యాన్ కాదు, కరువు మ్యాన్ అన్నారు.


