విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు

దాములూరు(ఇబ్రహీంపట్నం): విద్యుతాఘాతంతో ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కార్మికుడు మృతి చెందిన ఘటన మండలం పరిధిలోని దాములూరులో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కొంతమంది కార్మికులు దాములూరులో నూతన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు పనుల కోసం ఓ కాంట్రాక్టర్‌ తీసుకొచ్చారు. ఈ క్రమంలో విద్యుత్‌ లైన్‌మన్‌ విద్యుత్‌ తీగల పనులు చేయిస్తుండగా డుంబి సింకు (33) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో నిమ్రా వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్‌ లైన్‌మన్‌ నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు మరణించాడని తోటి కార్మికులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు డిమాండ్‌ చేశారు. గ్రామం వెలుపల ఉన్న విద్యుత్‌ లైన్‌లు ఒకదానికి ఒకటి కలుసుకోవడంతో ప్రమాదం జరిగిందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరి మృతి

ఎర్రుపాలెం/గంపలగూడెం: అతివేగానికి తోడు హెల్మెట్‌ ధరించకపోవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సమీపాన ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన కొరకొప్పుల ప్రేమ్‌కుమార్‌(32) మధిరలోని ఓ షోరూమ్‌లో వాషింగ్‌ మెషీన్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ జిల్లాకే చెందిన మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సగ్గుర్తి రాంబాబు ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో ప్రేమ్‌కుమార్‌ తన భార్య సౌజన్య, కుమార్తె ఆరాధ్య, కోడలు పూజితతో కలిసి ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెద్దమ్మ ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఇదే సమయంలో సగ్గురి రాంబాబు(40) స్వగ్రామం నుంచి ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని తన చెల్లి ఇంటికి మోపెడ్‌పై వస్తున్నాడు.

రోడ్డు మలుపులో..

బనిగండ్లపాడు – బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల మధ్య శ్రీఆంజనేయస్వామి గుడి రోడ్డు మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ బైక్‌లు వేగంగా రావడంతో ఘటనాస్థలిలోనే సగ్గుర్తి రాంబాబు మృతి చెందగా, ప్రేమ్‌కుమార్‌ను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనలో ప్రేమ్‌ బైక్‌పై ఉన్న ఆరాధ్యకు సైతం గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు ఎస్‌ఐ ఎం.రమేష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా.. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement