మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీపీ డీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీరు యు.హనుమయ్య తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని తన కార్యాల యంలో అధికారులతో జిల్లాలోని పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, విద్యుత్ లైన్ల పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హనుమయ్య మాట్లాడుతూ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలపై దృష్టి పెట్టామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బంది, అవసరమైన విద్యుత్ సామగ్రి, వాహనాలను సిద్ధంచేశామన్నారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, స్తంభాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తిన వెంటనే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, తడిసిన విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ తీగలు తెగిపడినట్లు గుర్తిస్తే వెంటనే సమీప విద్యుత్ అధికారులకు లేదా 1912 విద్యుత్ కస్టమర్ కేర్ నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఏడుకొండలరావు, విశ్వేశరప్రసాద్, శ్రీనివాసరావు ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యుత్‌శాఖ ఎన్టీఆర్ జిల్లా
ఎస్‌ఈ హనుమయ్య


