గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నెల 30వ తేదీన పట్టాల పంపిణీ జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. తొలిదశలో జిల్లా వ్యాప్తంగా 24,042 మందికి ఈ పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. 1970, 1980, ఆ తదుపరి సంవత్సరాల్లో జారీచేసిన ఎన్టీఆర్ పట్టాలు, ఇతర పట్టాలకు సంబంధించి 12,710 మంది లబ్ధిదారులకు 306 జీఓ ద్వారా మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూముల్లో నివసి స్తున్న 2,586 మంది లబ్ధిదారుల కేసులను జీఓ నంబర్ 30 ద్వారా పరిష్కరించి, క్రమబద్ధీకరించామన్నారు. 8,746 మంది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్ (పీఓటీ) ఉల్లంఘనదారుల సమస్య కూడా పరిష్కారమైందన్నారు. విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్, గన్నవరం, మైల వరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో 24,042 మంది లబ్ధిదారులకు చెందిన 616.56 ఎకరాల భూమికి సంబంధించి ప్రైవేటు ఆస్తికి సమానంగా అన్ని హక్కులతో పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


