మచిలీపట్నంఅర్బన్: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం కోరారు. ఈ మేరకు వీఆర్‌ఏలు సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. వెంకటరత్నం మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో గ్రామస్థాయిలో భూమిశిస్తు వసూళ్లు, రీ–సర్వేలో భూముల కొలతలు, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు మండల, డివిజన్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ పనులు, నైట్ వాచ్‌మెన్ విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి చాట్ల రమేష్ మాట్లాడుతూ వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన వారందరికీ ఓటీఎస్ విధానంలో ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. నామినీలుగా పనిచేస్తున్న వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, విధుల్లో ఉండగా మృతి చెందిన వీఆర్‌ఏల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్‌ఏల నుంచి వీఆర్‌ఓలుగా ఉద్యోగోన్నతులు కల్పించే కోటాను ప్రస్తుతం 30 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని కోరారు. జీఓ 13, సీనియారిటీ ప్రకారం ఇంటర్ విద్యార్హత కలిగిన అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. నైట్ వాచ్‌మెన్, అటెండర్ పోస్టులకు ప్రస్తుతం అమలవుతున్న 20 శాతం ఉద్యోగోన్నతి కోటాను 80 శాతానికి పెంచాలని కోరారు. 40 ఏళ్లుగా సేవలందిస్తున్న వీఆర్‌ఏలకు సైతం ఉద్యోగోన్నతులు లభించని పరిస్థితి ఉందని తెలిపారు. వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.21 వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


