కోనేరుసెంటర్: మీకోసంలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 56 అర్జీలు స్వీకరించారు. అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానమైన అర్జీలు
● వాడగొయ్యి గ్రామానికి చెందిన పద్మ అనే వివాహిత భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది.
● తోట్లవల్లూరుకు చెందిన బ్రహ్మాజీ తన వ్యవసాయ భూమిని బంధువులు ఆక్రమించుకుని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా తనపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని వాపోయాడు. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.
● కూచిపూడికి చెందిన మురళి అనే నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన స్నేహితుడు తన వద్ద నగదు తీసుకున్నాడని, ఏడాది గడిచినా ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని వాపోయాడు. తన డబ్బు తిరిగిమ్మని అడిగినందుకు బెదిరిస్తున్నాడని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరాడు.


