రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. విజయవాడ నుంచి రాజాం వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. విజయవాడలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజాం వెళ్తుండగా మార్గమధ్యంలో నిడమానూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పటమట పోలీసులు పేర్కొన్నారు.
గుడివాడ రూరల్: మద్యం మత్తులో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం స్థానిక శోభన కాంప్లెక్స్ వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పట్టణంలోని గుడ్‌మెన్‌పేటకు చెందిన వేసపోగు నాగరాజు (40) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దాడికి పాల్పడి హత్య చేసిన వ్యక్తి పట్టణంలోని కొమరగుండ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ హనీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గంపలగూడెం: కారును బస్సు ఢీ కొనడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన ఊటుకూరులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గంపలగూడెం నుంచి నెమలి వెళ్తోంది. ఊటుకూరు పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమీపాన(మలుపు వద్ద) నిలిపి ఉన్న కారును ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో హైటెన్షన్ విద్యుత్ స్తంభం అక్కడికక్కడే విరిగి పడిపోయింది. దీనితో విద్యుత్ వైర్లు తెగి బస్సుపై పడ్డాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రహదారిపై కార్ పార్కింగ్ చేయడంతో పాటు రహదారి గుంతలమయంగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ ఏఈ సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు విరిగిన స్తంభాన్ని, వైర్లను తొలగించి విద్యుత్ పునరుద్ధరణ పనులను ఆ శాఖ సిబ్బంది పూర్తి చేశారు.
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం యూట్యూబర్ ప్రశ్న రావణ్(బచ్చలకూరి జోసఫ్) విచారణ కొనసాగింది. దర్యాప్తు అధికారి డీఎస్పీ కె.ధర్మేంద్ర నేతృత్వంలో రావణ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ ప్రక్రియలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు కూడా పాల్గొన్నారు. ఉపా కేసుకు సంబంధించి అదనపు సమాచారాన్ని రావణ్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిషేధిత మావోయిస్టులకు మద్దతుగా వీడియో చేయడంపై వెనుక కారణాలు, ప్రశ్న యూట్యూబ్ చానల్ నిర్వహణ, రాజకీయ పార్టీలతో సంబంధాలు గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ స్టూడియోలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సాంకేతిక పరికరాలు ఆధారంగా అధికారులు వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్ పాల్గొన్నారు.


