ఘంటసాల: అక్కినేని నాగేశ్వరరావు నటన, గాయక ఘంటసాల వెంకటేశ్వరరావు గానం అజరామరం అని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం అన్నారు. ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘంటసాలలోని శ్రీజలధీశ్వర స్వామి ఆలయంలో అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి వేడుకలను డీఆర్వో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘంటసాల వంశ జన్మశాలైన ఘంటసాల గ్రామంలో అక్కినేని నాగేశ్వరరావు జయంతిని నిర్వహిస్తూ ఆయనకు ఘంటసాల వారు పాడిన పాటలతో నీరాజనం అర్పించడం హర్షదాయకమన్నారు. మహానటుడు అక్కినేని, గాయక ఘంటసాల కారణజన్ములన్నారు. అక్కినేని తన 40 ఏళ్ల వయస్సులోనే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్యనందించాలనే లక్ష్యంతో గుడివాడలో ఏఎన్నార్ కాలేజీ స్థాపించారన్నారు. నేటికి వేలాది మంది విద్యార్థులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న గాయకులను సమీకరించి ఇంతచక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఘంటసాల కళాసమితి సభ్యులను అభినందించారు. అనంతరం డీఆర్వో దంపతులను కళాసమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల, ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు కాటూరి మురళీకృష్ణ, ఘంటసాల కళాసమితి అధ్యక్షులు ఘంటసాల కృష్ణమోహన్, రాజ్యలక్ష్మి గాయకులను సన్మానించారు.
అలరించిన పాటలు..
అక్కినేని జయంతి సందర్భంగా అక్కినేని, గాయక ఘంటసాల కాంబినేషన్‌లోని పాటలను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గాయకులు కె.రామకృష్ణ, ఎన్.లోక్‌నాథ్, యు.మోహనరావు, సీహెచ్.యజ్ఞ ప్రసాద్, డి.రాంబాబు, కొడాలి కోదండ రామశర్మ, శాయిన హరిప్రసాద్, తుర్లపాటి రామ్మోహనరావు, ఘంటసాల కృష్ణమోహన్ – రాజ్యలక్ష్మి దంపతులు అక్కినేని నాగేశ్వరరావుకు ఘంటసాల వారు పాడిన పాటలతో అలరించారు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండి అఖిల భారత ఏఎన్నార్ సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఘంటసాల గ్రామానికి చెందిన స్వర్గీయ తాతినేని జవహర్ తమ్ముడు రవిని కళా సమితి వారు సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బండి పరాత్పరరావు, ఆర్‌ఐ కె.శ్రీనివాస్, కొండపల్లి శ్రీకాంత్, ఆలయ అర్చకులు చావలి కృష్ణకిషోర్, దాలిపర్తి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
అక్కినేని జయంతి వేడుకల్లో డీఆర్వో లక్ష్మీ నరసింహం


