నేటి నుంచి స్వీయ గణన నగారా | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి స్వీయ గణన నగారా

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

నేటి నుంచి స్వీయ గణన నగారా

చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం 2027 జనాభా గణనకు సంబంధించి ప్రజలకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఏప్రిల్‌ 16 నుంచి 30వ తేదీ వరకు కల్పించినట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనగణన రెండు దశల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు. ఈసారి మొట్టమొదటిగా డిజిటల్‌ సాధనాల ద్వారా డేటా సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్యుమరేటర్లు తమ సొంత స్మార్ట్‌ ఫోన్‌లో ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్లను ఉపయోగించి కుటుంబాల వివరాలను సేకరిస్తారన్నారు. ప్రజలు స్వీయ గణన ద్వారా సమర్పించిన సమాచారాన్ని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ధ్రువీకరిస్తారన్నారు. ఇళ్ల జాబితా, గణనకు సంబంధించి ప్రాథమిక ఏర్పాటు కొనసాగుతోందని ఇందులో భాగంగా మాస్టర్‌ ట్రైనర్లు, ఫీల్డ్‌ ట్రైనర్లు ఎంపిక చేసే వారికి తగిన శిక్షణ ఇచ్చామన్నారు. మండలాలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లను గుర్తించామన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి నెలాఖరు వరకు నాలుగు బ్యాచ్‌లుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు మొదటి దశ ఇళ్ల జాబితా, గణన ఎంపిక చేయబడిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల ద్వారా నిర్వహించటం జరుగుతుందన్నారు. స్వీయ గణన కోసం వెబ్‌సైట్‌ https://se. census.gov.inను సందర్శించాలన్నారు. జనగణన ముఖ్యమైన కార్యక్రమం అయినందున ప్రజలందరూ సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు పాల్గొన్నారు.

వివరాలు వెల్లడించిన కలెక్టర్‌ బాలాజీ

Advertisement
 
Advertisement
Advertisement