సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను భవిష్యత్ తరరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కళాకారులు సహకార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి కళను మరింత విశ్వవ్యాప్తి చేయాలని కోరారు. కొండపల్లి బొమ్మల కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో హస్త కళాకారుల సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. శతాబ్దాల చారిత్రక ఔన్నత్యమున్న కొండపల్లి బొమ్మకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు అందరి కృషి అవసరమన్నారు. కొత్త డిజైన్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అభివృద్ధితో పాటు కొండపల్లి ఒక మోడల్ గ్రామీణ ఆర్థిక కేంద్రంగా మార్చడానికి చొరవ చూపుతున్నామని వెల్లడించారు. జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, బొమ్మల కళాకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ


