వేగవంతంగా భవనాల నిర్మాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):అన్నదానం, లడ్డూ పోటు భవనాలను ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ జీవీఆర్ శేఖర్ సూచించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదానం, లడ్డూ పోటు, ఎలివేటెడ్ క్లూ కాంప్లెక్స్ పనులను చీఫ్ ఇంజినీర్ శేఖర్, దుర్గగుడి ఈవో శీనానాయక్ శనివారం పరిశీలించారు. అన్నదాన భవనం గ్రౌండ్ ప్లోర్‌లో పాలు, పెరుగు, కూరగాయల కోసం ఏర్పాటు చేస్తున్న కోల్డ్ స్టోరేజీ, సరుకుల గోడౌన్ నిర్మాణ పనులు తనిఖీ చేశారు. రూ. 23 కోట్ల వ్యయంతో చేపట్టిన అన్నదాన భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించి ఇంజినీరింగ్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశామన్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. పనులను పరిశీలించిన వారిలో డీఈఈ రవీంద్ర, ఏఈఈ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు):లారీ ఢీకొనడంతో ద్విచక్ర వామనంపై వెళ్తున్న కారు డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన శ్రీరాం సందీప్ (25) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అదుపుతప్పి లారీ వెనుక చక్రం కిందపడి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కోనేరుసెంటర్:చెరువులో పడి ఓ విద్యార్ధి మృతి చెందిన ఘటనపై బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల మేరకు... ముసునూరు మండలం దేవురగుండ గ్రామానికి చెందిన మన్నే రాజ్‌కుమార్ (12) మచిలీపట్నం మండలం రుద్రవరం గురుకులం పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం వెనుక వైపు ఉన్న ఓ పాత చెరువు వద్దకు వెళ్లాడు. స్నేహితులంతా కలిసి చెరువులో ఉన్న చిన్నపాటి గుంతలోకి దిగి స్నానం చేస్తుండటంతో రాజ్‌కుమార్ కూడా వాళ్ళతో పాటు స్నానం చేసేందుకు గుంతలోకి దిగాడు. రాజ్‌కుమార్‌తో పాటు మిగిలిన పిల్లలు కనిపించకపోవటంతో అనుమానం వచ్చిన పీఈటీ రవిశంకర్ ఇతర విద్యార్థులను పిలిచి వారి గురించి ఆరా తీయగా విద్యార్థులంతా కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం గోడ వెనక్కివెళ్లినట్లు చెప్పారు. దీంతో పీఈటి కొంత మంది విద్యార్థులను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. పీఈటీని చూసిన పిల్లలంతా అక్కడి నుంచి పారిపోతుండగా రాజ్‌కుమార్ గుంతలో మరింత లోతుకు మునిగిపోయాడు. విషయాన్ని గ్రహించిన పీఈటీతో పాటు పెద్ద పిల్లలు రాజ్‌కుమార్‌ను బయటికి లాగారు. అప్పటికే రాజ్‌కుమార్ మురుగునీరు తాగి వాంతులు చేసుకున్నాడు. విషయం సీరియస్‌గా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై నాగరాజు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థి వివరాలు నమోదు చేసుకున్నారు. తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.
వేగవంతంగా భవనాల నిర్మాణం


