జర్నలిజాన్ని అణచివేయలేరు
అక్రమ కేసులతో
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని శుక్రవారం పలు పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉమ్మడి జిల్లాతోపాటు పలు నియోజకవర్గాల్లో పాత్రికేయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
మచిలీపట్నం అర్బన్: పత్రికా స్వేచ్ఛను హరించి అక్రమ కేసులతో జర్నలిజాన్ని అణచివేయలేరని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పాత్రికేయ సంఘాలు స్పష్టం చేశాయి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై, ఆరుగురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం పాత్రికేయుల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండే పత్రికారంగాన్ని అక్రమ కేసులతో అణచివేయాలనుకోవడం అవివేకమన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని పత్రికలతో ప్రజలకు తెలియజేసే భావ ప్రకటన స్వేచ్ఛ పాత్రికేయులకు ఉందన్నారు. ధనంజయరెడ్డిపై బనాయించిన అక్రమ కేసును కూటమి ప్రభుత్వం వ్యక్తిగత విరోధంతో చేపట్టిన చర్యగా భావిస్తున్నామన్నారు. ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసుతో పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. పత్రికల్లో తప్పును తప్పుగా చూపిస్తే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూడడం సహేతుకం కాదన్నారు. జర్నలిజంపై ఉక్కుపాదం మోపాలని చూడటం అవివేకమన్నారు. ధనుంజయరెడ్డితో పాటు ఆరుగురు జర్నలిస్టులపై పెట్టిన తప్పుడు కేసును పోలీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులను ప్రోత్సహించే పనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. లేదంటే కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలను కలం వీరులు రాష్ట్రవ్యాప్తంగా ఎండగడతారని హెచ్చరించారు.
● విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యాన నిరసన తెలిపి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతిపత్రం అందజేశారు.
● జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వి.శ్రీనివాసరావు, కె.మునిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన క్రిమినల్ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలి
పాత్రికేయ సంఘాలు


