
నాగేంద్ర స్వామికి పాలు, పండ్లు సమర్పిస్తున్న భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నాగుల చవితిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే స్వామి వారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టతో పాటు జంట నాగులకు భక్తులు పాలు, పండ్లు సమర్పించారు. ఉదయం స్వామి వారికి ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చన నిర్వహించారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి వారికి పాలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించిన వారి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకమని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఉదయం ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరావడంతో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.