ఈ నెల 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ‘మన ఇసుక వాహనం’ సాంకేతికత సమస్యలతో కొత్త చిక్కులు ఆన్‌లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ట్రాక్టర్ల యజమానులు పారదర్శకత పెరుగుతుందని అధికారుల వెల్లడి
ఆసిఫాబాద్: అక్రమ రవాణాను నియంత్రించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్, ఆన్‌లైన్ విధానంతో ఇసుక బుకింగ్ ప్రక్రియను ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చింది. కలెక్టర్ కె.హరిత జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ విధానం అమలు చేస్తున్నప్పటికీ కొత్త నిబంధనలు భారంగా మారాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా సామాన్యులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్‌లో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. ఇంటి అనుమతి, ఇతర సర్టిఫికెట్లతోపాటు డ్రైవర్ లైసెన్సు, ట్రాక్టర్ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో రవాణాకు నిర్దిష్ట సమయం లేకపోగా, కొత్త విధానంలో మాత్రం పగటిపూట మాత్రమే రవాణా చేయాలనే నిబంధన చేర్చారు.
ధరల భారం
మన ఇసుక వాహనం ద్వారా బుకింగ్ చేయాలంటే యాప్‌లో ట్రాక్టర్‌కు రూ.775, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కింద రూ.115 చెల్లించాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత రవాణా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జిల్లాలో అమలు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రూ.1400కు ట్రాక్టర్ ఇసుక లభించింది. తాజా నిబంధనలతో ప్రభుత్వానికి రూ.775 చెల్లించాల్సి ఉండగా, ఇతర ఖర్చులతో కలిపి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2500 వెచ్చించాల్సి వస్తోంది. నిర్మాణదారులపై దాదాపు రెట్టింపు భారం పడుతోంది. ట్రాక్టర్ యజమానులు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ రంగ ధరలు పెరుగుతుండగా తాజాగా ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ పద్ధతితో మరింత భారంగా మారిందని ట్రాక్టర్ యజమానులు, నిర్మాణదారులు వాపోతున్నారు. కొత్త విధానంతో జిల్లాలోని నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. పొరుగున్న ఉన్న మంచిర్యాల జిల్లాలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.445 చెల్లిస్తుండగా, మన జిల్లాలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.775 విధించడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో 14 ఇసుక రీచ్‌లు
ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్, సిర్పూర్–టి, పెంచికల్‌పేట్, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం మండలాల్లో మొత్తం 14 ఇసుక రీచ్‌లను అధి కారులు గుర్తించారు. మన ఇసుక వాహనం బుకింగ్ ప్రక్రియ ఈ నెల 1న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 269 ట్రాక్టర్లు బుక్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 84 మందిపై 48 కేసులు నమోదు చేశారు.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి
మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఫోన్ లేదా మీసేవలో ఇసుక బుకింగ్ చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రవాణా చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్ల వరకు పొందవచ్చు. ఇతర నిర్మాణాలకు అనుమతి పత్రాలతోపాటు ట్రాక్టర్ డ్రైవర్ వివరాలతో యాప్‌లో బుక్ చేసుకోవాలి.
– గంగాధర్, మైనింగ్ శాఖ ఏడీ


